
వారణాసి: కాంగ్రెస్ కుటుంబ వారసత్వ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయన్న ప్రధాని మోడీకి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఘాటుగా బదులిచ్చా రు. గడిచిన ఐదేండ్లలో నరేంద్ర మోడీ వ్యవస్థల్ని ఎలా నాశనం చేశారో జనమంతా చూశారని, ప్రజల్ని ఫూల్స్‌గా లెక్కగట్టడం ప్రధాని ఇకనైనా మానుకోవాలని, మంచిచెడుల్ని జనం గ్రహిస్తారని అన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక చేపట్టిన గంగా యాత్ర బుధవారంతో ముగిసింది. చివరి మజిలీగా వారణాసిలోని అస్సీ ఘాట్‌కు చేరుకున్న కాంగ్రెస్ నేత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సాధువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. బెదిరిస్తే భయపడం పీఎం మోడీ తన బ్లాగ్‌లో రాసిన వ్యాసంపై స్పందించిన ప్రియాంక, ‘‘అధికారంలో ఉన్నోళ్లకు రెండు రకాల దురభిప్రాయాలుంటాయి. ఒకటి, ప్రజల్ని చాలా సులువుగా తప్పుదోవపట్టించొచ్చుని అనుకుంటారు. రెండోది అధికార దండంతో అందరినీ బెదిరిస్తారు. వీళ్ల బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు. మమ్మల్ని ఏం చేసినా, ఎంతలా వేధించినా పోరాడుతూనే ఉంటాం . గత ఐదేండ్లుగా మోడీ పద్ధతి ప్రకారం ఇనిస్టిట్యూషన్స్ని నాశనం చేశారు. మీడియా గొంతునొక్కిందీ ఆయనే. పని చేయకుండా కేవలం ప్రచారంతోనే గెలవొచ్చనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు జనం గట్టిగా బుద్ధి చెప్పాలి’’అని అన్నారు.