పాలమూరు ప్రాజెక్టుకు అడుగడుగునా సమస్యలు

పాలమూరు ప్రాజెక్టుకు అడుగడుగునా సమస్యలు
  • ప్రాజెక్టుకు అడుగడుగునా సమస్యలు
  • ఎన్జీటీ ముంగట పర్యావరణ పర్మిషన్ల వివాదం
  • పనులు చేపట్టొద్దని స్టే ఇచ్చిన ట్రిబ్యునల్
  • ఏళ్లపాటు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేసిన కాంట్రాక్టర్లు
  • తెలంగాణ వచ్చినంక మొదలైన తొలి ప్రాజెక్టు.. ఎప్పటికి పూర్తయితదో?

హైదరాబాద్, వెలుగు:  ‘పాలమూరు – రంగారెడ్డి’ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక చిక్కుముళ్లు, సవాళ్లను ఎదుర్కొంటోంది. వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపట్టడంతో పర్మిషన్లు వస్తాయా లేదా అనే సందేహం వెంటాడుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేస్తుండటంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసి స్టే విధించింది. పర్మిషన్ రాకుంటే లోన్ల రీపేమెంట్ ఎలా చేస్తారని ఫైనాన్స్ సంస్థలు కొర్రీలు పెడుతున్నాయి. లోన్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపుల్లేవు కాబట్టి అనుమతులు ఇస్తామంటేనే డీపీఆర్ సమర్పిస్తామని కేంద్రానికి రాష్ట్రం నివేదించింది. చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మొత్తంగా 12 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ప్రమాదంలో పడింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదట పునాది రాయి వేసిన పాలమూరు ఎత్తిపోతల పథకం ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి నెలకొంది.

గెజిట్ తెచ్చిన తంటా
కేంద్ర జలశక్తి శాఖ నిరుడు జులై 15న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు పర్మిషన్ లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలనే రూల్ పెట్టారు. దీంతో ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పర్మిషన్ లేని ప్రాజెక్టుకు లోన్లు ఎలా ఇవ్వాలని ఫైనాన్స్ సంస్థలు అంటున్నాయి. తాము మోటార్లు సప్లయ్ చేస్తే వాటి బిల్లులు ఎలా చెల్లిస్తారని బీహెచ్ఈఎల్ కూడా వివరణ కోరింది. కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి ఈ ప్రాజెక్టు కోసం రూ.11 వేల కోట్లకు పైగా లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. రూ.600 కోట్ల లోన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. మిగతా మొత్తం పెండింగ్ లో పడింది. వరద జలాల ఆధారంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు గెజిట్ లో పేర్కొన్న డెడ్ లైన్ లోగా పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు. దీంతో లోన్లు రాక, రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వక ప్రాజెక్టు ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పర్యావరణ అనుమతులపై నిర్లక్ష్యం
పాలమూరు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు పొందడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఈ ప్రాజెక్టుకు మొదటి దశ పర్యావరణ అనుమతులిచ్చి, పబ్లిక్ హియరింగ్ నిర్వహించి నిర్వాసిత రైతుల నుంచి భూసేకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ఆధారంగా ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ (ఈఏసీ) ముందుకు వెళ్లి తుది అనుమతులు పొందేందుకు అవకాశమిచ్చింది. రాష్ట్ర సర్కార్​ 2019 మొదట్లోనే ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు  ప్రకటన ఇచ్చింది. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఒత్తిడితో పబ్లిక్ హియరింగ్ పక్కన పెట్టారు. ఏడాదిన్నర తర్వాత పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఈఏసీకి వెళ్లడానికి ప్రయత్నించినా అప్పటికే న్యాయ వివాదాలు చుట్టుముట్టాయి. ప్రాజెక్టు కోసం చేపట్టిన పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నాయని ఎన్జీటీ తేల్చింది. పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేయడానికి ఎక్స్​పర్ట్ కమిటీ వేసింది. పర్యావరణ అనుమతులు పొందే వరకు పనులు ఆపేయాలని ఆదేశిస్తూ స్టే విధించింది. ఫలితంగా పాలమూరు, డిండి ఎత్తిపోతలపై ఆధారపడ్డ 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎప్పటికి నీళ్లు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

2018 నాటికే పూర్తి కావాల్సి ఉన్నా..
శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని ఎత్తిపోసే ఎల్లూరు పంపుహౌస్ నుంచి ఉద్దండాపూర్ రిజర్వాయర్ వరకు పనులను 18 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. 2018 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా.. రెండుసార్లు గడువు పెంచారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 45 రోజుల్లో 90 టీఎంసీలు ఎత్తిపోసి పాలమూరు ఆయకట్టు 9.30 లక్షల ఎకరాలు, డిండి ఆయకట్టు 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 జనవరి నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి కనీసం ఒక టీఎంసీ నీళ్లు ఎత్తిపోస్తామని సీఎం ప్రకటించారు. నిరుడు ఈ ప్రాజెక్టుపైనే నాలుగైదు సార్లు భేటీ అయి పెండింగ్ బిల్లులు రూ.2 వేల కోట్లు రిలీజ్ చేయాలని ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పోవడంతో పనులకు బ్రేక్ పడింది.