
- ఇరు దేశాల మధ్య రహస్యంగా చర్చలు జరుగుతున్నాయి
- నవంబర్ చివరికి భారత్‌పై టారిఫ్‌లు తగ్గొచ్చు
- కొవిడ్ తర్వాత నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది: సీఈఏ అనంత నాగేశ్వరన్
కోల్‌కతా:
అమెరికా, ఇండియా మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలకు త్వరలో పరిష్కారం దొరకనుందని భావిస్తున్నట్టు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) అనంత నాగేశ్వరన్ అన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత వస్తువులపై 25 శాతానికి అదనంగా మరో 25 శాతం పెనాల్టీ టారిఫ్‌ను ట్రంప్ ప్రభుత్వం విధించింది.
ఈ అదనపు టారిఫ్ నవంబర్ చివరినాటికి తొలుగుతుందని ఆయన చెప్పారు. భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో సీఈఏ మాట్లాడుతూ, “రహస్యంగా రెండు ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి. నవంబర్ చివరికి పెనాల్టీ టారిఫ్‌లు తొలుగుతాయని ఆశిస్తున్నాను” అని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అంచనా అని స్పష్టం చేశారు.
ఆర్థిక వ్యవస్థ దూకుడు
భారత్‌ను అభివృద్ధి చెందుతున్న లో-మిడిల్- ఇన్‌కమ్ ఆర్థిక వ్యవస్థగా నాగేశ్వరన్ అభివర్ణించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని జూన్ క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి రేటు 7.8శాతానికి చేరిందని గుర్తు చేశారు. కొవిడ్ అనంతరం భారత్ వృద్ధిరేటు ఇతర దేశాలతో పోలిస్తే వేగంగా పెరిగిందని, తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల వృద్ధి వచ్చే రెండు సంవత్సరాల్లో కీలకంగా మారనుందని, వినియోగం, పెట్టుబడులు వృద్ధికి ఆధారంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
‘‘అప్పులు, జీడీపీ రేషియో బాగుంది. ప్రతి డాలర్ అప్పుతో భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ జీడీపీ సృష్టించింది. గ్రామీణ డిమాండ్ స్థిరంగా ఉండగా, నగరాల్లో వినియోగం పెరుగుతోంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు వల్ల వినియోగదారుల చేతిలో డబ్బు పెరిగి, నగర వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది” అని ఆయన వివరించారు.
ఎంఎస్‌ఎంఈలకు ఆసరా..
మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) లకు అప్పులివ్వడానికి ఫైనాన్షియల్ సంస్థలు ముందుకొస్తున్నాయి. పెద్ద పరిశ్రమలకు ఇస్తున్న అప్పుల్లో కూడా వ్యవస్థీకృతంగా మార్పులు మొదలయ్యాయని నాగేశ్వరన్ తెలిపారు. నిధుల సమీకరణకు అవకాశాలు భారీగా ఉన్నాయని చెప్పారు.
‘‘గ్లోబల్‌గా ఆర్థిక అనిశ్చితులు ఉన్నా, ఇండియా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. విదేశీ మారక నిల్వలు మంచి స్థాయిలో ఉన్నాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2025–26 మొదటి క్వార్టర్‌లో జీడీపీలో 0.2 శాతానికి తగ్గింది”అని తెలిపారు. రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్నా, లాంగ్‌టెర్మ్‌లో విలువ నిలుపుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు, నియంత్రణల సడలింపుపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు.
చైనా నుంచే ముడిసరుకులే ఎక్కువ వస్తున్నాయి
చైనా నుంచి ముఖ్యంగా ఇంటర్మీడియేట్, క్యాపిటల్ గూడ్స్ దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటితో ఇండియాలో తయారీ పెరుగుతోంది. అందువలన ఈ దిగుమతులపై ఆందోళన పడొద్దని నాగేశ్వరన్ అన్నారు. భారత ప్రైవేట్ రంగం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) పై ఖర్చు పెంచాలని, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఏఐ ప్రభావం ఇప్పటివరకు సాధారణ స్థాయిలో ఉందని, కోడింగ్- లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నా, ఓవరాల్‌గా ఉద్యోగాలపై దీని ప్రభావం అంతగా నెగెటివ్ కాదు అని అన్నారు. ఉద్యోగులు తమ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు.