
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్అక్రమాలకు పాల్పడ్డట్టు అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను సెబీ తోసిపుచ్చింది. బిలియనీర్ గౌతమ్ అదానీకి, అతని గ్రూప్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీలలోకి నిధులు మళ్లించడానికి రిలేటెడ్పార్టీలను ఉపయోగించినట్లు ఎటువంటి ఆధారాలూ దొరకలేదని తెలిపింది.
ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు నిరాధారమని తమ దర్యాప్తులో తేలిందని ప్రకటించింది. 2023 జనవరిలో అదానీ గ్రూప్‌పై ఒక నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల నుంచి అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల ఖాతాలకు డబ్బు మళ్లించడానికి అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్, మైల్స్టోన్ ట్రేడ్‌లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వర్ ఇన్‌ఫ్రాలను ఉపయోగించినట్లు ఆరోపించింది.
ఇవి రిలేటెడ్పార్టీ ట్రాన్సాక్షన్లు కావని, నిబంధనల ఉల్లంఘన జరగలేదని సెబీ బోర్డు సభ్యుడు కమలేష్ చెప్పారు. అదానీ సంస్థలు లేదా ఎగ్జిక్యూటివ్‌లపై బాధ్యత లేదా జరిమానాలను విధించడానికి ఆధారాలు లేవని సెబీ పేర్కొంది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత.. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల స్టాక్ విలువ దాదాపు 150 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. ఈ నివేదికలో చేసిన ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ పలుమార్లు ఖండించింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా ఎలాంటి తప్పూ జరగలేదని పేర్కొంది.