అద్దె భవనాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు

అద్దె భవనాల్లో   రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు
  • లక్షల్లో  కిరాయిలు అధ్వానంగా సౌలతులు
  • జోగులాంబ గద్వాల జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు,  హాస్టళ్లలో ఇబ్బందులు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు అద్దె భవనాల్లోనే అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. లక్షల్లో రెంట్లు కడుతున్నా స్టూడెంట్లకు కనీస సౌలతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గద్వాల జిల్లాలో  ఆరు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం ప్రభుత్వ బిల్డింగ్ లో కొనసాగుతుండగా..  5 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను కిరాయి బిల్డింగ్ లలో నిర్వహిస్తున్నారు.

 వీటికి ఒక్కొక్క బిల్డింగ్ కు మినిమం రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు అద్దెలు  చెల్లిస్తున్నది. మైనార్టీ గురుకుల పాఠశాలలు మూడు ఉన్నాయి. వీటికి కూడా లక్షల్లో కిరాయి కడుతున్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ , బీసీ గవర్నమెంట్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ నాలుగు ఉండగా కిరాయి బిల్డింగ్ లలోనే కొనసాగిస్తున్నారు. మొత్తంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని హాస్టల్స్ కు  కిరాయిల రూపంలోనే నెలకు  రూ. 30 లక్షల  నుంచి రూ. 40 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

బాత్రూంలు, మరుగుదొడ్లు లేవు

లక్షల్లో  అద్దెలు కడుతున్న కూడా ఆయా బిల్డింగ్ లలో సరిపడ బాత్రూంలు, మరుగుదొడ్లు లేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గద్వాలలోని ఓ గురుకుల స్కూలులో స్టూడెంట్స్ రేకుల షెడ్డులో పడుకునే పరిస్థితి ఉన్నది.  అక్కడ ఒక రూమ్ ను బాత్రూంలుగా మార్చడంతో వాటిని వాడుకునేందుకు గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు. మైనార్టీ గురుకుల స్కూల్లో కూడా స్టూడెంట్స్ వసతులు సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అలంపూర్ చౌరస్తాలోని గురుకుల హాస్టల్ లో బాత్రూంలు లేక వ్యవసాయ పొలాల వెంబడి వెళ్లాల్సి వస్తున్నదని స్టూడెంట్స్ వాపోతున్నారు.

కమిషన్లు ఇచ్చిన వారి బిల్డింగులు రెంటుకు తీసుకున్నారు

ప్రైవేట్ బిల్డింగులను హాస్టల్స్ కోసం కిరాయి తీసుకునే సందర్భంలో అన్ని సౌలతులు ఉన్నాయా..? లేవా..? అని వెరిఫై చేసి రెంటుకు తీసుకోవాల్సి ఉంటుంది.కానీ గతంలో పైరవీలు చేసుకున్న వారి బిల్డింగ్ లను కిరాయికి తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ లీడర్లు బిల్డింగ్ ఓనర్ల నుండి పెద్ద మొత్తంలో కమిషన్లు దండుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దరూర్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ రెంటు విషయంలో బీఆర్ఎస్ లీడర్ల కమిషన్ల వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  సౌలతులు లేకున్నా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంతో ఆయా బిల్డింగ్ లను ఒకే చేశారు.

కానీ  ఇప్పుడు అక్కడ ఉంటున్న వారికి ఇబ్బందులు వస్తున్నాయి. సమస్యలతో వేగలేక ఏకంగా రెండు రోజుల క్రితం అలంపూర్ చౌరస్తాలోని బీసీ గురుకుల స్టూడెంట్స్ పాదయాత్రగా బయలుదేరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో బీచుపల్లి గురుకుల స్కూల్ స్టూడెంట్స్ కూడా ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, సౌకర్యాలు లేవని బీచుపల్లి నుండి కలెక్టరేట్ కు పాదయాత్రగా తరలివచ్చి సమస్యలు చెప్పుకున్నారు. 

ప్రభుత్వానికి కిరాయిల భారం

హాస్టల్స్, గురుకులాలు కిరాయి బిల్డింగ్లలో ఏర్పాటు చేయడంతో ప్రభుత్వానికి కూడా నెలనెలా కిరాయిల భారం పడుతున్నది. వాస్తవంగా నెలకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలను  కిరాయి రూపంలోనే ప్రభుత్వం చెల్లిస్తున్నది.  ఒకవేళ దూర దృష్టితో ముందుగానే సొంత బిల్డింగ్‌లలో హాస్టల్స్ ఏర్పాటు చేసి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదు. ప్రస్తుతం చెల్లిస్తున్న కిరాయిలతో ఏడాదికి రెండు హాస్టల్స్ కూడా కట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.  ఆ దిశగా అప్పటి ప్రభుత్వం అడుగు వేయకపోవడంతో కిరాయి బిల్డింగ్ లతోనే కాలం గడపాల్సి వస్తున్నది.

సమస్యల పరిష్కారానికి స్పెషల్ ఆఫీసర్లు

హాస్టల్స్ గురుకులాలలో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ సంతోష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.  ప్రతి హాస్టల్‌కు ఒక స్పెషల్ ఆఫీసర్లు నియమించి ప్రతిరోజు హాస్టల్ విజిట్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. రోజువారి నివేదికల ఆధారంగా సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెడుతున్నారు.

 ప్రపోజల్స్ పంపమన్నారు

రెంట్లకు ఉన్న బిల్డింగ్‌లలో కొంత ఇబ్బంది ఉంది.  కొత్త బిల్డింగ్ ల నిర్మాణం కోసం ప్రపోజల్స్ పంపమని కలెక్టర్ నివేదిక కోరారు.  ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట వెంటనే బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సమస్యలు రాకుండా ఉండేందుకు కలెక్టర్ సీరియస్ గా ఫోకస్ పెట్టి స్పెషల్ ఆఫీసర్లను నియమించారు.- నుషిత, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, గద్వాల