‘రామారెడ్డి’లో కోతుల దాడిలో వృద్ధురాలు మృతి

‘రామారెడ్డి’లో కోతుల దాడిలో  వృద్ధురాలు మృతి

నిజామాబాద్,  వెలుగు : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వాసులకు కోతుల కష్టాలు తప్పడం లేదు.  గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా గుంపులు గుంపులుగా సంచరిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి.  ఇండ్లలోకి చొరబడి దొరికిన ఆహారాన్ని  తినడమే కాకుండా అడ్డుకోబోయిన వారిపై ఎగబడి దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలో చాలా మంది గాయపడి ఆస్పత్రుల్లో చేరుతుండగా,  కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వానరాల ఆగడాలను అరికట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు  ఎన్ని సార్లు చెప్పినా నివారణ చర్యలు తీసుకోవడం లేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు.  

వందల సంఖ్యలో.. గుంపులు గుంపులుగా..      

                                                       
జిల్లాలో బాల్కొండ, భీంగల్, జక్రాన్ పల్లి, మాక్లూర్, నవీపేట, డిచ్ పల్లి, వర్ని,  బాన్స్ వాడ, కామారెడ్డి గ్రామాలు, పట్టణాల్లో  కోతుల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్​నగరంలోని  పలు కాలనీల్లో, ముప్కాల్, మెండోరా, అడవి మామిడిపల్లి, అర్గుల్​లో వందల కోతులు జనావాసాల్లో వీర విహారం చేస్తున్నాయి. మహిళలు, చిన్నారులు కనిపిస్తే చాలు దాడులు చేస్తున్నాయి. ఇండ్లలోకి చొరబడి ఆహారపదార్థాలు, కూరగాయలు ఎత్తుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఫారెస్ట్ సమీప గ్రామాలు, పట్టణాల్లో  కోతులు హడలెత్తిస్తున్నాయి.   జిల్లాలో ఫారెస్ట్, కోతులకు ఆహారమైన పండ్ల తోటలు లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లోకి వస్తున్నాయి.  

జిల్లాలో ముగ్గురి మృతి

కోతుల దాడిలో చాలా మంది గాయపడుతుండగా, కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.  8 నెలల కింద నిజామాబాద్​జిల్లా మాక్లూర్​మండలంలోని మామిడిపల్లిలో కోతులు వెంటపడడంతో  ఇద్దరు చిన్నారులు  చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయారు.  కామారెడ్డి జిల్లా రామారం మండల కేంద్రంలో కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన  వృద్ధురాలు  చిన్న నర్సవ్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ   శనివారం రాత్రి  చనిపోయింది. కోతుల దాడుల్లో గాయపడిన కొందరు చిన్నారులకు రేబీస్​వ్యాధి వస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

 లక్షలు ఖర్చు చేస్తున్న వీడీసీలు

కోతులను  పట్టుకునేందుకు విలేజ్ డెవలప్ మెంట్​ కమిటీలు లక్షల రూపాయలు ఖర్చు  చేస్తున్నాయి.  ఇటీవల  మెండోరా గ్రామం నుంచి కోతులను తరలించేందుకు ఉత్తరప్రదేశ్, విశాఖ ఏజెన్సీ నుంచి కోతులు పట్టేవారిని తీసుకొచ్చి రూ. 2 లక్షలు ఖర్చు చేశారు.  ప్రతీ ఇంటికి రూ. 1,500  చొప్పున వేసుకున్నారు. తాజాగా మామిడిపల్లిలో కోతులు తరలించేందుకు విలేజ్​ కమిటీ తీర్మానం చేసింది. 

మంకీ పార్క్​కోసం డిమాండ్​

ఉమ్మడి జిల్లాలో 85  వేల కోతులు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిజామాబాద్​జిల్లాలో ఉన్న 40 వేల కోతుల్లో  ఎనిమిది వందల కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.  నివారణకు ఆపరేషన్లే కాకుండా,  జిల్లాలోని ఫారెస్ట్ లో  మంకీ పార్క్ పెట్టాలని ప్రజలు నుంచి డిమాండ్  వినిపిస్తోంది. 2016లో   నిర్మల్ జిల్లా సారంగా పూర్ మండలం చించోలి  వద్ద కోతుల పార్క్ ఏర్పాటు చేశారు.  పది ఎకరాల స్థలంలో రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పార్కులో  పండ్ల మొక్కలను పెంచుతున్నారు. 

పైసలు ఖర్చయినా ప్రాబ్లం తీర్తలే..

లక్షల రూపాయలు ఖర్చు చేసి కోతులను పట్టిస్తున్నం. బోన్లల్ల పెట్టి అడవుల్లో వదిలేస్తున్నం. కానీ ఆహారం లేక మళ్లా అవి ఊర్లలోకే వస్తున్నయ్. చాలా గ్రామాల్లో కోతుల కొట్టుడు పనిగా మారిపోయింది. కోతులు చాలా మందిపై దాడులు చేస్తుండడంతో రేబిస్​వ్యాధి సోకే ప్రమాదం ఉంది. పీహెచ్​సీల్లో యాంటీ రేబీస్​ఇంజక్షన్లు అందుబాటులో  ఉంచాలి.
- విజయ్, వీడీసీ ప్రెసిడెంట్, ముప్కాల్​

 ఆపరేషన్లు పూర్తి చేస్తాం  

జిల్లాలో కోతుల కు.ని ఆపరేషన్లు త్వరలోనే పూర్తి చేస్తాం. ఇప్పటివరకు 800 కోతులకు  ఆపరేషన్లు చేశాం. ఇందుకోసం  యూపీ, ఏపీలోని ఎక్సఫర్ట్​లను పిలిపిస్తున్నాం. కొన్నింటిని  చించోలి కోతుల పార్క్​ కు తరలిస్తున్నాం. 
- వికాస్​మీనా, డీఎఫ్​వో