డిజిటల్​ ఇంటి నెంబర్లు  ఉన్నట్టా లేనట్టా..!

డిజిటల్​ ఇంటి నెంబర్లు  ఉన్నట్టా లేనట్టా..!
  • అమలైతే అక్రమ ఇండ్ల నెంబర్లకు చెక్
  • 8 మున్సిపాలిటీల్లో  ఒకే నెంబర్ పై చాలా ఇండ్లు
  • ప్రాపర్టీ టాక్స్ ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీలు 

సంగారెడ్డి, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేత అరికట్టేందుకు తీసుకొచ్చిన డిజిటల్ ఇంటి నెంబర్ల ప్రక్రియ పాలకులు, ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా మూలన పడింది.  దీంతో బల్దియాలకు ఆదాయం తగ్గి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 1.10 లక్షల ఇండ్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ రెండు లక్షల ఇండ్లకు పైగానే ఉన్నట్టు అంచనా.

ఇంటి నెంబర్లు సరిగ్గా లేక ఇళ్లను గుర్తించడం అధికారులకు కష్టమవుతోంది. పట్టణాల పరిధిలో ఇంటి నెంబర్ల అక్రమాలను గుర్తించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం డిజిటల్ ఇంటి నెంబర్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను స్టేట్​లోని అన్ని బల్దియాల్లో చేపట్టాలని మార్చి 2023లో ఆదేశించింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు, పాలకవర్గాల అనాసక్తి కారణంగా జిల్లాలోని ఏ ఒక్క బల్దియాలో డిజిటల్ నెంబర్ల ప్రక్రియను స్టార్ట్ చేయలేదు. సంగారెడ్డి తోపాటు జహీరాబాద్, అమీన్పూర్, సదాశివపేట, తెల్లాపూర్ మున్సిపాలిటీలలో గతంలో అక్రమ ఇంటి నెంబర్ల బాగోతం బయటపడింది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

జిల్లాలో ఇలా..

జిల్లాలోని 8 బల్దియాల్లో మొత్తం 1.10 లక్షల ఇళ్లు ఉన్నాయి. వాటిలో సంగారెడ్డిలో 22 వేలు, జహీరాబాద్ లో 14 వేలు, సదాశివపేటలో 11 వేలు, నారాయణఖేడ్ లో 8,500, ఆందోల్- జోగిపేటలో 8 వేలు, తెల్లాపూర్ లో 15,500,  బొల్లారంలో 14 వేలు, అమీన్ పూర్ మున్సిపాలిటీలో 17 వేల ఇండ్లు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే టౌన్ ల పరిధిలో ఉండే కాలనీల్లో ఒకే ఇంటి నెంబర్ మూడేసి ఇండ్లకు కేటాయించడం చాలా చోట్ల జరిగింది. మున్సిపాలిటీలలో ఇంటింటికి డిజిటల్ నెంబర్ ఇస్తే ఆయా ఇళ్ల లెక్క పక్కాగా ఉంటుంది.

డిజిటల్ నెంబర్లతో బల్దియాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాత ఇంటి నెంబర్ల స్థానంలో కొత్తగా డిజిటల్ నెంబర్లు కేటాయిస్తే వార్డుల్లోని ఇళ్లకు క్రమసంఖ్య నంబర్లు వస్తాయి. పైగా కాలనీల పేర్లు, రోడ్ నెంబర్లు, ఇళ్ల అంతస్తులు, ప్రాపర్టీ ట్యాక్స్ ల వసూళ్లు ఇతరత్రా వివరాలు పక్కగా ఉంటాయి. అలా నమోదు చేసిన వివరాలను గూగుల్ లో పొందుపరిచి భువన్ యాప్ లో సమగ్ర వివరాలు నమోదు చేస్తే ఇండ్ల సమాచారం ఆన్ లైన్ లో పక్కాగా అందుబాటులోకి వస్తుంది. దీంతో ఇంటి పన్నుల చెల్లింపుల్లో ఇబ్బందులు పోయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

ఇదంతా జరిగితే ఇప్పటివరకు ఇంటి నెంబర్లపై జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని పాలకవర్గాలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డిజిటల్ ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తలేరన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి డిజిటల్ నెంబర్లను అమలు చేసి అక్రమాలను వెలికి తీయాలని ప్రజలు కోరుతున్నారు.