కొత్త జిల్లాల వారీగా మత్స్య సహకార సంఘాలు.. కొనసాగుతున్న రిజిస్ట్రేషన్​ ప్రాసెసింగ్

కొత్త జిల్లాల వారీగా మత్స్య సహకార సంఘాలు.. కొనసాగుతున్న రిజిస్ట్రేషన్​ ప్రాసెసింగ్
  • అన్ని జిల్లాలకు అడ్​హక్​ కమిటీల ఏర్పాటు
  • ఆరు నెలల్లోపు జిల్లా సొసైటీలకు ఎన్నికలు

మెదక్​, వెలుగు : రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఇదివరకు పాత జిల్లా ప్రాతిపదికగా ఉన్న జిల్లా సొసైటీలు రద్దు కాగా, కొత్త జిల్లాల వారీగా జిల్లా సొసైటీలను రిజిస్టర్  చేసి ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది.

మత్స్యకారులకు చేయూత అందించేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీములు అందించేందుకు వీలుగా ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, రాష్ట్ర మత్స్య ఫెడరేషన్​ ఏర్పాటయ్యాయి. మత్స్య సొసైటీల్లో సభ్యులైన మత్స్యకారులకు చేపల పెంపకానికి అవసరమైన సీడ్, వలలు, తెప్పలు తదితర ఉపకరణాల కొనుగోలుకు సహకారం అందించడం, మార్కెటింగ్​ సౌకర్యాలు కల్పించడం జిల్లా మత్స్య సొసైటీల బాధ్యత. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో మొత్తం 5,800 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక  సహకార సంఘాలు ఉన్నాయి.

వాటిలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నీరు అందుబాటులోకి వచ్చాక చేపల పెంపకానికి అవకాశాలు బాగా పెరిగాయని చెప్పి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం మరింత ఎక్కువ మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు మెంబర్ షిప్  స్పెషల్ డ్రైవ్  చేపట్టింది. ప్రభుత్వ  గైడ్​లైన్స్​ ప్రకారం ప్రభుత్వం గుర్తించిన 33 మత్స్యకార కుటుంబాలకు చెందిన, 18  ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారికి  సొసైటీలో సభ్యత్వం కల్పించారు. ఇదివరకు సొసైటీలు లేని గ్రామాల్లో  కొత్త  సొసైటీలను కూడా  ఏర్పాటు చేశారు.  

జిల్లాల పునర్విభజన జరిగినా..

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో 2016లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లాల సంఖ్య 33కు చేరినా మత్స్య సహకార సంఘాలు మాత్రం పాత 10 జిల్లాల వారీగానే ఉన్నాయి.  మెంబర్​ షిప్​ డ్రైవ్​ చేపట్టి, కొత్త సొసైటీలు ఏర్పాటు చేసిన క్రమంలోనే నిరుడు కొత్త జిల్లాల వారీగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే అసెంబ్లీ ఎలక్షన్​ నోటిఫికేషన్​ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్​ పడింది. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో ఇపుడు కొత్త జిల్లాల ప్రాతిపదికన హైదరాబాద్  మినహా 32 జిల్లాలకు మత్స్య సహకార సంఘాల ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది.

ఆరు నెలల్లో ఎన్నికలు

పాత జిల్లాల వారీగా ఉన్న జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పదవీకాలం ముగిసిపోగా వాటిని రద్దు చేశారు. కొత్త జిల్లాల వారీగా ఆయా జిల్లాల పరిధిలోని ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి జిల్లా సొసైటీల ఏర్పాటుకు తీర్మానం చేసి కొత్త జిల్లా పేరుతో సొసైటీల రిజిస్ట్రేషన్​ చేస్తున్నారు. ప్రస్తుతానికి  కొత్త జిల్లాలకు అడ్ హక్ కమిటీలను నియమిస్తుండగా, ఆరు నెలల్లోపు జిల్లా సొసైటీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. స్టేట్​ కో ఆపరేటివ్ ఎలక్షన్​ అథారిటీ ఆధ్వర్యంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు జరుగనున్నాయి.

నేడు మెదక్ లో సమావేశం 

జిల్లాల పునర్​ వ్వవస్థీకరణ జరగడంతో మెదక్​ జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో ఇదివరకటి మెదక్  జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రద్దయింది. ఈ మేరకు కొత్త మెదక్  జిల్లాకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేసేందుకు ఈనెల 9న జిల్లాలోని అన్ని ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశాం.
- నర్సింహారావ్, డిస్ట్రిక్​ ఫిషరీస్​ ఆఫీసర్, మెదక్​