
కాశ్మీర్ పండిట్స్పై దాడులు, వలసలపై తీసిన చిత్రం ‘ద కాశ్మీర్ ఫైల్స్’. రీసెంట్‌గా హిందీలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ఇంతటి ఘన విజయం దక్కిందంటున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఈ విషయమై హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ ‘వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. సామాన్య ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా రియాక్టవడంతో భారీ హైప్ వచ్చింది. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా వంద కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. త్వరలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోకీ డబ్ చేసి రిలీజ్ చేస్తాం. మిగతా వెర్షన్స్‌లోనూ థియేటర్స్‌లో రిలీజైన తర్వాతే ఈ సినిమా ఓటీటీకి వస్తుంది. ఆల్రెడీ తొమ్మిది రాష్ట్రాల్లో ఈ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చారు. మేం ఏ ప్రభుత్వాన్నీ అడగలేదు. వాలంటరీగా వాళ్లే ఇచ్చారు. ఇంకా చూపించాల్సిన సీక్రెట్స్ చాలా ఉన్నప్పటికీ దీనికి సీక్వెల్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేను. అనుపమ్ ఖేర్ కూడా కాశ్మీర్ పండిట్ కావడంతో ఆయన సపోర్ట్ మాకు బాగా హెల్పయ్యింది. ఇక రవితేజతో ‘టైగర్ నాగేశ్వరరావు’ నిర్మిస్తున్నాను. ఏప్రిల్‌లో సెట్స్‌కి వెళ్తుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. హిందీలో అబ్దుల్ కలామ్ బయోపిక్ లైన్‌లో ఉంది. అలాగే వివేక్ రంజన్ తో నే మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి త్వరలోనే రివీల్ చేస్తాం’ అని చెప్పారు.