పవన్ ఆశయాలంటే నాకు ఇష్టం:నిర్మాత ఏఎం రత్నం

పవన్ ఆశయాలంటే నాకు ఇష్టం:నిర్మాత ఏఎం రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో  గొప్ప చిత్రంగా ‘హరి హర వీరమల్లు’ నిలిచిపోతుందని  నిర్మాత ఏఎం రత్నం అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్​, జ్యోతి కృష్ణ రూపొందించిన  చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం చెప్పిన విశేషాలు. 

‘‘బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు.  17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ.  ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ రాశారు. అంతే తప్ప పండగ సాయన్న జీవిత కథతో దీనికి సంబంధం లేదు.  ఇక ‘హరి హర వీరమల్లు’ టైటిల్  పెట్టడానికి కారణం.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలని ముందుగా అనుకోలేదు.  చారిత్రక నేపథ్యమున్న కథ కావడంతో స్పాన్ పెరిగింది. ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల  అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ‘ఖుషి’ లాంటి యూత్‌‌ఫుల్‌‌ లవ్‌‌స్టోరీలోని పాటలో ‘ఏ మేరా జహా’ అంటూ దేశభక్తిని తీసుకొచ్చారు.  ఆ సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. ఎందరికో స్ఫూర్తిని కలిగించే విషయాలు తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు. 

ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది.  నేను 'భారతీయుడు' సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమా విజయంపై మరింత నమ్మకం ఏర్పడింది.  పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. అలాగే పవన్ గారి అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది’’.