చీటింగ్ కేసు: బెల్లంకొండ సురేష్ వార్నింగ్

చీటింగ్ కేసు: బెల్లంకొండ సురేష్ వార్నింగ్

హైదరాబాద్: సినిమా తీయడానికి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారంటూ తనపై వచ్చిన వార్తలను నిర్మాత బెల్లంకొండ సురేష్ ఖండించారు. తన కొడుకు, హీరో సాయి శ్రీనివాస్ జోలికి వచ్చిన వారిని వదలబోనన్నారు. తనపై ఆరోపణలు చేసిన శరణ్ మీద పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు వేస్తానని చెప్పారు. శరణ్ వెనుక ఉన్న వారినీ విడిచిపెట్టనని హెచ్చరించారు.  తాను శరణ్ దగ్గర డబ్బులు తీసుకోలేదని.. ఇది తప్పుడు కేసు అని స్పష్టం చేశారు.

‘నా కొడుకు జోలికొస్తే ఎవ్వరినీ క్షమించను. సాయి శ్రీనివాస్ నటించిన వాటిలో ఇప్పటివరకు 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అతడు ఇండియాలోనే నంబర్ వన్ హీరోగా ఉన్నాడు. శ్రీనివాస్ సినిమాలకు 600 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. తెలుగులో ఫ్లాపైన కవచం, సీత లాంటి సినిమాలకూ నార్త్ లో మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇప్పుడు ఛత్రపతి రీమేక్ తోపాటు నేషనల్ వైడ్ గా అతడు మంచి ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ సమయంలో శ్రీనివాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబోం’ అని బెల్లంకొండ సురేష్ అన్నారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన చెప్పారు. తాను మోసం చేసినట్లు ఆధారాలు ఉంటే ఫిల్మ్ ఛాంబర్, కౌన్సిల్ లేదా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిందన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా వేసిన ప్రైవేట్ కంప్లయింట్ ఇది అని.. తప్పుడు కేసులతో తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని సురేష్ మండిపడ్డారు.

కాగా, టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మీద చీటింగ్‌ కేసు నమోదైంది. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని.. ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమా నిర్మిస్తున్నానంటూ బెల్లంకొండ సురేష్‌ 2018లో రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడని.. ఆ తర్వాత గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో మరో సినిమా అంటూ మరోసారి నమ్మించి డబ్బు తీసుకున్నాడని శరణ్‌ ఆరోపించాడు. ఇలా తన దగ్గర నుంచి మొత్తంగా రూ.85 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ కోర్టును ఆశ్రయించాడు. 

మరిన్ని వార్తల కోసం:

ఖైదీలకు సుశీల్ కుమార్ రెజ్లింగ్ పాఠాలు

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?