
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తర్వాత అతి తక్కువ టైమ్‌లో యూత్ ఫాలోయింగ్‌ను బాగా పెంచుకున్న హీరో విజయ్ దేవరకొండ అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. పవన్ తర్వాత టాలీవుడ్‌కు దొరికిన యూత్‌ఫుల్ స్టార్ విజయ్ అని ప్రశంసించారు. తన ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమవుతున్న ఆశిష్ నటించిన రౌడీ బాయ్స్ సినిమా పాటల వేడుకలో దిల్ రాజు పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఇది యూత్‌ఫుల్ కంటెంట్ ఉన్న మూవీ అని, అందుకే రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టామన్నారు. విజయ్‌కు రౌడీ బాయ్ అనే ట్యాగ్ లైన్ ఉందని.. అందుకే ఆయన పర్మిషన్ తీసుకున్నామని తెలిపారు.
విజయ్‌తో సినిమా తీయాలని చాలాసార్లు అనుకున్నామని.. కానీ కుదర్లేదని దిల్ రాజు పేర్కొన్నారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి మూవీలతో యూత్‌లో విజయ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడని మెచ్చుకున్నారు. పవన్ తర్వాత మరో యూత్‌ఫుల్ స్టార్ విజయ్ అని గీత గోవిందం సక్సెస్ మీట్‌లో తాను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. విజయ్ తన సక్సెస్ రన్‌ను కొనసాగించాలని, పాన్ ఇండియా హీరోగా మరింత గుర్తింపు తెచ్చుకోవాలని దిల్ రాజు అన్నారు.