‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నిర్మాత సాహు గారపాటి హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేశారు. టికెట్ ధరలకు సంబంధించి చిత్రం విడుదలకు 90 రోజుల ముందే నిర్మాత హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అప్పీలుపై ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇబ్బందికరంగా ఉన్నాయని చిత్ర నిర్మాత తరపు న్యాయవాది వాదించారు. సింగిల్ బెంచ్ దగ్గర పిటిషన్ విచారణలో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్మాతను ఆదేశించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాకు టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన రూ.42 కోట్లను వసూలు చేయాలని కోరుతూ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు పి.శ్రీనివాసరెడ్డి, మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారణ చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. మన శంకర వరప్రసాద్ సినిమా ప్రత్యేక షోకు రూ.600, సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసిందన్నారు.
►ALSO READ | RANABAALI: ‘రణబాలి’ గ్లింప్స్ AI కాదు.. నిజమైన క్రియేషన్.. పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన డైరెక్టర్ రాహుల్
ఈ మెమో ద్వారా సుమారు రూ.42 కోట్ల దాకా అదనంగా వసూలు అయిందన్నారు. హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా టిక్కెట్ ధరలను పెంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ సంచయ నిధికి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, షైన్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, దర్శకుడు అనిల్ రావిపూడి, పంపిణీదారు దిల్‌రాజు, బుక్ మై షో యాజమాన్యం తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఈ పిటిషన్‌లను ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లతోపాటు జత చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.
