
చెన్నై: ప్రముఖ నిర్మాత వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం చెన్నైలో చనిపోయారు. తెలుగులో భైరవ ద్విపం, బృందావనం లాంటి పలు సినిమాలు నిర్మించారు వెంకట్రామిరెడ్డి. తమిళంలో ఐదు సినిమాలకు వెంకట్రామిరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. విశాల్, అజిత్, విజయ్, ధనుష్‌లతో పాటు, ఇతర నటీనటులతో పలు సినిమాలు తీశారు.
ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఏటా పురస్కారాలను అందిస్తున్నారు. సోమవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకట్రామిరెడ్డి మృతిపై ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు. విజయా-వాహినీ సంస్థల అధినేత బి.నాగిరెడ్డి కుమారుడే వెంకట్రామిరెడ్డి.