తెలంగాణ ఉద్యమంలో మనం ప్రతినిత్యం విన్న నినాదం ఇక్కడి ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ఇక్కడివారికే దక్కాలి. అప్పుడు ఉద్యమకారులు ఈ నినాదం ఆంధ్ర వలసదారులను ఉద్దేశించి ఇచ్చిన నినాదం. తెలంగాణ వచ్చిన 11 ఏండ్లకు ఈ నినాదాన్ని రివ్యూ చేయాలి. నీళ్లు ఇక్కడివి ఇక్కడే ఉంటయి. నిధులలో పంపకాలు కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా తేల్చుకోవాలి. నియామకాలు ప్రభుత్వ రంగంలోవి చట్టరీత్యా తెలంగాణవాళ్లుగా నిర్వచించినవారికే దొరుకుతాయి. కానీ, ప్రైవేటు కంపెనీ నియామకాలు వాళ్ల ఇష్టానుసారం నియమించుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు తెలంగాణవారికే ఇవ్వాలనే నియంత్రణ కష్టతరమైంది.
నిధులంటే కేవలం ప్రభుత్వ బడ్జెట్ నిధులే కాదు. తెలంగాణలోని ప్రైవేటు రంగ నిధులల్లో 2014 తరువాత క్యాలిటేటివ్ మార్పు వచ్చింది. తెలంగాణ కుల సర్వే ప్రకారం లక్షలాది మంది ఒక కొత్త కేటగిరీలో నమోదు చేసుకున్నారు. ఈ కేటగిరి తెలంగాణలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. అదే ‘నో క్యాస్ట్’. తెలంగాణ పెట్టుబడి, బిజినెస్ నిధులు ఈ కేటగిరీలో ఉన్నాయి. నిధులు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి? జీఎస్టీ పన్ను ద్వారా కదా! పెద్దమొత్తం నిధులను ఆపరేట్ చేసే ఇండస్ట్రీ, బిజినెస్‌దారులకు తెలంగాణ నాది అనే భావన లేనప్పుడు పన్నులు కట్టడం, ఎగ్గొట్టడం చాలా సులభం.
పెద్ద వ్యాపారుల నుంచి, పెద్ద కంపెనీల నుంచి చిన్న వ్యాపారాలనే తీసుకుందాం. తెలంగాణ గ్రామాల్లో, ముఖ్యంగా ఎక్కువగా కనపడే వ్యాపారాలు కిరాణా, హార్డ్‌వేర్. ఈ మెజారిటీ షాపులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకాక ముందు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ చిరు వ్యాపారాలు పైకెదిగినకొద్దీ మండల, తాలుకా, జిల్లా, హైదరాబాద్ స్థాయి నుంచి హోల్‌సేల్ వ్యాపారులు పంపిణీ విధానం ద్వారా నడుస్తాయి.
రాష్ట్రం హోల్‌సేల్ వ్యాపారం ఎవరి చేతిలో ఉంది? ఇది కాక పెద్ద పట్టణాల్లో అంటే హైదరాబాద్ పాత 10 జిల్లా కేంద్రాలలో తెరుచుకున్న మాల్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? తెలంగాణ నిధులు తెలంగాణవారి చేతిలోనే ఉండాలని ఉద్యమం చేసిన కార్యకర్తలను అటుంచండి, నాయకుల కుటుంబాల చేతిలోనైనా ఉన్నాయా! నిజానికి రాష్ట్రంలోని ఎక్కువ నిధులు రాష్ట్రం 2014లో ఏర్పడిన తరువాత వివిధం రంగాల్లోకి బయట నుంచి మైగ్రేట్ అయినవారి చేతిలో ఉన్నాయి.
వ్యాపారం రంగంపై అంచనా లేదు
ఆనాటి ఉద్యమ నాయకులకుగాని, మేధావులకుగాని, కార్యకర్తలకుగాని ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక వ్యాపార రంగంలో ఎవరొచ్చి చేరతారనే అంశంపై అంతగా అంచనా లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో శూద్ర, దళిత, ఆదివాసీ కులాలకు వ్యాపార రంగం మీద ఎటూ పట్టులేదు. అవగాహన లేదు. గ్రామీణ ప్రాంతంలో గౌడ్స్‌కి కల్లు, ఇతర లిక్కర్ వ్యాపారాల మీద కొంత పట్టు ఉంది. రెడ్లలో ఒక చిన్న వర్గం ఫార్మా ఉత్పత్తి, వ్యాపారం, స్వీట్స్, చికెన్ వ్యాపారం వంటి కొన్ని రంగాలలో ఎంట్రీ ఉంది. కానీ దేశంలోని పెద్ద ఉత్పత్తిదారులుగా, వ్యాపారవేత్తలుగా దిగిన దాఖలాలు లేవు. రియల్ ఎస్టేట్‌లో ఆంధ్రావారితో కలిసిగానీ, విడిగా గానీ పనిచేసిన రెడ్లకు, వెలమలకు అనుభవం ఉంది. కానీ దేశస్థాయి కనస్ట్రక్షన్ కంపెనీల్లో కూడా వీళ్లు లేరు.
వీళ్లు కూడా లోకల్ రియల్ఎస్టేట్దారులే. రాష్ట్రంలోని నిధులు వ్యవసాయ రంగానివి మినహాయిస్తే, పారిశ్రామిక రంగంలోగానీ, మేజర్ సర్వీస్ రంగంలోగానీ తెలంగాణ వారి చేతుల్లో లేవు. 2014 నాటికి తెంగాణలో సెటిల్ అయిన ఆంధ్రావారి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మైగ్రేట్ అయినవారి చేతిలో కంటే తక్కువే. ఇక్కడ ఏర్పడుతున్న మిగులు సంపద ఈ రాష్ర్టంలో ఖర్చు అయి ఇక్కడే జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికిపొయ్యే డబ్బు కంటే ఇతర రాష్ట్రాలకు తరలిపోయే డబ్బు ఎక్కువ.
కొత్త ఆలోచనలు లేక..
మొత్తం తెలంగాణ బిజినెస్, పారిశ్రామిక ఉత్పత్తిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన శక్తులు నడుపుతుంటే ఏం చేయాలనేది పెద్ద సమస్య. చట్టరీత్యా దేశంలో ఎక్కడైనా బిజినెస్ చేసుకునే హక్కు పౌరులందరికీ ఉన్నది. అయితే, నిధుల కోసం ఉద్యమాలు చేసిన శక్తులన్నీ తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాయి. వాళ్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం వెతుకులాడుతున్నారు. రాజకీయ రంగంలో కొద్దిమంది మాత్రమే బతకగలరు. వ్యవసాయ రంగాన్ని గ్రామస్థాయిలో అభివృద్ధి చేస్తూ పాత నుంచి కొత్త ఉత్పత్తుల గురించి ఆలోచించే యువత చాలా తక్కువ. అన్నిటికంటే ముఖ్యం గ్రామ స్థాయి నుంచి బిజినెస్, పారా మెడికల్ ప్రాక్టీసెస్, అగ్రేరియన్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి జరిగే ప్రయత్నాల్లో భాగస్వామ్యం వీరికి లేదు. వీరి ఆలోచనల్లో కూడా లేదు.
తెలంగాణవాళ్లకు పట్టని వ్యాపార రంగం
గ్రామ, మండల, తాలుకా, జిల్లా, హైదరాబాద్ స్థాయి బిజినెజ్లో భాగస్వాములయ్యే ప్రక్రియలు మొదలెట్టాల్సిన అవసరం చాలా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతీ యువకులకు ఒక కిరాణా నుంచి మొదలుకొని హార్డ్‌వేర్ వంటి దుకాణాలు నడపడం అనే ఆలోచనే లేదు. వాటికి పెట్టుబడి ఒక సమస్య ఉంటుంది. అయితే, ఆ రంగంలో ప్రవేశానికి ఒక ప్రయత్నం చాలా ముఖ్యం. ఇతర రాష్ట్రాలలో కులాలు, కులాలుగా బిజినెస్‌లో పెరిగినవారు వచ్చి తెలంగాణలో బిజినెస్ రంగాన్ని ఆక్రమించడం ఎందుకు చేశారు? ఇక్కడివారు వారిని ఆ రం గంలో చొరబడకుండా ఆ రంగంలోని అన్ని మార్కెట్లను ఆక్రమించలేదు కనుక. కొనుగోలుదారులు లేకుండా అమ్మకందారులు వివిధ స్థాయిల్లో మనలేరు. అయితే, అమ్మకందారులు తెలంగాణవారే ఎందుకు కావడం లేదు? ఆ రంగం ఆక్రమించాలనే ఆలోచన లేకనే.
బిజినెస్‌లోకి తెలంగాణ యువత రావాలి
మునుముందు కుటుంబాల, గ్రామాల, పట్టణాల ఆర్థిక స్థితిగతులు కొత్తరకం ఉత్పత్తుల మీద, వ్యాపారాల మీద ఆధారపడి అభివృద్ధి చెందుతాయి. తెలంగాణ యువకులు పెట్టుబడి పెట్టగలిగేవాళ్లు లేదా ఒంటరిగా పెట్టలేనివారు వాటాదార్లుగా తయారై మనిషి ఇంతని పెట్టి.. ప్రభుత్వ, బ్యాంకుల సహాయంతో అన్ని రకాల బిజినెస్‌లోకి ఎంటర్ కావాలి. రాష్ర్టంలో బిజినెస్ అన్ని కులాల బిజినెస్‌గా మార్చాలి. రాష్ట్రంలోని నిధులు రాష్ట్ర మార్కెట్లలో ఖర్చుపెట్టే ఆర్థిక వనరులు ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్టీ పెరుగుతుంది. ఇప్పుడున్న బిజినెస్‌లో చాలా భాగం ‘సున్నా’ బిజినెస్‌గా నడుస్తున్నది. ఇంత ఆన్లైన్ పేమెంట్లు జరుగుతున్నప్పటికీ ఆ డబ్బులో జీఎస్టీ వాటా కట్టకుండా, సేల్స్‌ట్యాక్స్ అధికారులను మేనేజ్ చేసే పద్ధతి చాలామంది బిజెనెస్దారులు కనుక్కున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. ఇప్పుడున్న జీరో బిజినెస్ వ్యాపార పద్ధతి, మిగులు నిధిని ఇతర రాష్ట్రాలకు తరలించే పద్ధతి ద్వారా రాష్ట్రం అన్నిరకాలుగా నష్టపోతున్నది. రాష్ట్రంలో ఉన్న నిధులు అనే ధనాన్ని ఒక్క రాష్ట్ర బడ్జెట్‌కు మాత్రమే ముడేసి చూడడం సరికాదు. నిధులు ఇప్పుడు బిజినెస్‌లో ఎక్కువ పోగుపడి ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి ప్లాన్డ్ మైగ్రేషన్
ఆర్ఎస్ఎస్, బీజేపీలు బిజినెస్ వర్గాలను ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మైగ్రేట్ చేయడం ఒక ప్లానుగా పెట్టుకున్నాయి. తెలంగాణ ‘నిధులను’ ఇక్కడ శూద్ర, ఓబీసీ, దళిత, ఆదివాసీ శక్తుల చేతిలో కేంద్రీకరించకుండా ఉండాలనేది వారి ఎత్తుగడ. అలా మైగ్రేట్ అయి ఇక్కడ హిందుత్వ ఆర్థిక సమీకరణకు బండి సంజయ్, అరవింద్, కిషన్‌రెడ్డిలాంటి తెలంగాణ శూద్ర ఓబీసీ నాయకుల మిలిటెంట్ రక్షణ కలిపిస్తున్నారు. ఇది దేశం మొత్తంమీద జరుగుతున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలకే లింకుగా ఏర్పడ్డ తెలంగాణ ఆర్థిక వనరులను ఇక్కడి శూద్ర, ఓబీసీ, దళిత, ఆదివాసీ చేతిలో ఉండకుండా చేయడమనేది ఆర్ఎస్ఎస్ ఆలోచన. ఆయా సంస్థల్లో పనిచేసేవారికి ఆర్థిక వనరులను కలిపిస్తారు.
కానీ, వాళ్లు శూద్రులు, ఓబీసీలు అయితే వారిని గుజరాత్, ముంబయి పెట్టుబడిదారులతో సమానంగా ఎదగడానికి అసలు అంగీకరించరు. వీరు ఏ పార్టీలో ఉన్నారు అనేది వారి సమస్య కాదు. వాళ్లు ఏ కులస్తులు అనేది వారి ఆర్థిక వనరుల సమీకరణ సమస్య. అయితే, తెలంగాణలోని ఉద్యమకారులు ఇక్కడి బీసీల ద్వారా వారు ఆర్గనైజ్ చేయించే ‘అలయ్ బలయ్’ కార్యక్రమాల్లో తిని సంతృప్తిపడుతున్నారు. ఇది అసలు సమస్య. పెట్టుబడి నిధులు వారి చేతిలో, ఉద్యమాల పేరుతో రోడ్లమీద తెలంగాణవాదులు.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
