కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిధుల దోపిడీ కోసమే..

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిధుల దోపిడీ కోసమే..

మంచిర్యాల, వెలుగు : నీళ్లు, నిధులను దోపిడీ చేసేందుకే సీఎం కేసీఆర్​కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని తెలంగాణ జన సమితి (టీజేఎస్​) అధ్యక్షుడు ప్రొఫెసర్​కోదండరామ్​ ఆరోపించారు. మల్లన్న సాగర్​ రిజర్వాయర్ ​ద్వారా గజ్వేల్, సిద్దిపేట జిల్లాకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుండా ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్​ జలాశయాలకు తరలించి111 జీవో రద్దును సమర్థించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్​ఎస్టేట్ ​బిజినెస్ ​కోసమే111 జీవోను రద్దు చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాలలోని చార్వాక హాల్​లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, మందాకిని కెనాల్ ​నిర్మించాలనే డిమాండ్​తో రౌండ్​టేబుల్​మీటింగ్​ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్​ మాట్లాడుతూ...తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందన్నారు. నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలని పర్యావరణవేత్తలు, నీటిపారుదల రంగ నిపుణులు సూచించినప్పటికీ కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. దీంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, వడ్డీలకే ఏటా రూ.24 వేల కోట్ల నిధులు వృథా అవుతున్నాయన్నారు. వక్తలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ప్రాణహిత ప్రాజెక్టును రద్దు చేసి ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకు అన్యాయం చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వార్దా ప్రాజెక్టును నిర్మించి ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాలకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని, బ్యాలెన్సింగ్​రిజర్వాయర్​గా కుఫ్టీని నిర్మించాలని, గ్రావిటీ ద్వారా సాగునీరందించాలన్నారు. నీటిపారుదల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రిటైర్డ్​ ఇంజనీర్​విఠల్​ రావు కాళేశ్వరంతో పాటు వివిధ ప్రాజెక్టుల్లోని లోపాలు, గ్రావిటీ గురించి వివరించారు. సమావేశంలో సీపీఐఎంఎల్​న్యూడెమోక్రసీ వేములపల్లి వెంకట్రామయ్య, గోదావరి పరిరక్షణ సమితి కన్వీనర్​ కేవీ.ప్రతాప్​, తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్​నైనాల గోవర్ధన్​ పాల్గొన్నారు.