లక్షల ఆదాయం వదులుకొని : పాలిటిక్స్​లోకి ప్రొఫెషనల్స్

లక్షల ఆదాయం వదులుకొని :  పాలిటిక్స్​లోకి ప్రొఫెషనల్స్
  •     అసెంబ్లీకి వెళ్లాలని తహతహా
  •     ఇప్పటికే కొందరు విజయం సాధించగా, మరికొందరి ప్రయత్నాలు

నిజామాబాద్, వెలుగు:వృత్తిపరంగా వివిధ నేపథ్యాలు ఉన్నవారు పాలిటిక్స్​పై ఆసక్తితో రాజకీయాల్లో రాణిస్తున్నారు. జిల్లాలో అనేకమంది డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్​వేర్​ ​రంగానికి చెందినవారు తమ వృత్తిని పక్కనబెట్టి ఆయా పార్టీల్లో కొనసాగుతున్నారు. ప్రొఫెషనల్స్​గా రూ.లక్షలు సంపాదించే అవకాశాలున్నా, వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. ఈ విషయంలో కొందరు ఇప్పటికే విజయం సాధించగా, మరికొందరు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

స్టెతస్కోప్​ వదిలి..

ఆర్థోపెడిక్​ డాక్టర్ అయిన  భూపతిరెడ్డి ప్రజాజీవితంపై ఆసక్తితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్​తరఫున ఒకసారి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలనే ఉద్దేశంతో డాకర్ట్​వృత్తిని పక్కనబెట్టి పూర్తిస్థాయి  రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ​నుంచి నిజామాబాద్​రూరల్ ​టికెట్ ఆశిస్తున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న డాక్టర్​మల్లికార్జున్​రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. 2014లో బాల్కొండ నుంచి పోటీ చేశారు.

పార్టీ అవకాశమిస్తే ఈసారి కూడా బరిలో నిలుస్తానంటున్నారు. ఆర్మూర్​కు చెందిన డాక్టర్​మధుశేఖర్​2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్​లో కొనసాగుతున్న ఆయనకు పార్టీ నామినేటెడ్​ పోస్టు ఇచ్చినా అసెంబ్లీకి వెళ్లాలనే ఆసక్తి మాత్రం తగ్గలేదు. మల్కాపూర్​ తండాకు చెందిన బిలోజీ నాయక్ ​రూరల్​టికెట్​ఆశిస్తుండగా, ఎల్లారెడ్డి నుంచి డాక్టర్ ​రామ్​సింగ్ ​ఇంట్రెస్ట్​గా ఉన్నారు.

తమకు టికెట్​ఇవ్వాలని వీరు బీజేపీకి అర్జీ పెట్టుకున్నారు. నిజామాబాద్​ అర్బన్ ​సెగ్మెంట్​నుంచి అవకాశం ఇవ్వాలని డాక్టర్​ శివప్రసాద్​ కాంగ్రెస్ ​పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు.

నల్లకోటు వదిలి పార్టీ కండువాలు..

2004, 2009 లో నిజామాబాద్​ ఎంపీగా గెలిచిన మధుగౌడ్ ​యాష్కీ విదేశాల్లో అడ్వకేట్​గా ​పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్​లో చేరి, రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎల్బీనగర్ టికెట్​కోసం దరఖాస్తు చేశారు. కామారెడ్డి బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న అరుణతారది న్యాయవృత్తి నేపథ్యమే. నిజామాబాద్​లో లాయర్​గా పనిచేస్తున్న ఆమె 1999లో టీడీపీ తరఫున జుక్కల్​ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గంలో  బీజేపీ నుంచి అసెంబ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. జుక్కల్ ​కాంగ్రెస్ ​టికెట్​ఆశిస్తున్న గడుగు గంగాధర్ ​కూడా లాయరే. గతంలో నిజామాబాద్ ​జిల్లా బీజేపీ ప్రెసిడెంట్​గా పనిచేసిన ఆర్మూర్​వాసి పెద్దోళ్ల గంగారెడ్డి లాయర్​ వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ సారి ఆర్మూర్​ నుంచి కమలం గుర్తుపై పోటీకి ఆసక్తిగా ఉన్నారు. 1994 ఎలక్షన్స్​లో బోధన్​ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లాయర్​ నర్సింహారెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో టికెట్​ఇస్తే పోటీకి సై అంటున్నారు.  

కొలువు వదులుకొని.. 

ఇరిగేషన్​శాఖలో ఇంజినీర్ ​ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లో చేరిన హన్మంత్​షిండే 2004లో జుక్కల్​లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన 2009, 2014, 2018 ఎన్నికల్లో హ్యాట్రిక్​విజయాలు సాధించారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బీఆర్ఎస్ నుంచి​ రంగంలో దిగనున్నారు. విమానాలు నడిపే కమర్షియల్​పైలెట్​ డిగ్రీ అర్హతలున్న కెప్టెన్​ కరుణాకర్​రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో 25 ఏండ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసిన ఆయన ఈ సారి బోధన్​ కాంగ్రెస్ ​టికెట్​ ఆశిస్తున్నారు

సాఫ్ట్​వేర్​ రంగం నుంచి.. 

2019 లోక్​సభ ఎన్నికల్లో జహీరాబాద్​ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన మదన్​మోహన్,​ఈ సారి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. సాఫ్ట్​వేర్ ​రంగానికి చెందిన ఈయన చాలా కాలంగా పాలిటిక్స్​లో ఉన్నారు. 2009 ఎన్నికల్లో బాల్కొండ నుంచి పోటీ చేసి గెలిచిన ఈరవత్రి అనిల్​ది సాఫ్ట్​వేర్ ​నేపథ్యమే. ఈసారి అర్బన్ ​నుంచి కాంగ్రెస్​ టికెట్​ఆశిస్తున్నారు.