విద్యుత్ సంస్థల్లో పదోన్నతులకు మోక్షమెప్పుడో?

విద్యుత్ సంస్థల్లో పదోన్నతులకు మోక్షమెప్పుడో?

తెలంగాణ విద్యుత్ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులు గత ఎడాదిన్నరగా పదోన్నతులకు ఎదురు చూస్తున్నారు.  ఒక్క జూనియర్ లైన్మెన్ క్యాడర్లోనే సుమారుగా 3600 మందికి పదోన్నతి ఇవ్వాల్సి ఉంది. గత యాజమాన్యాల అలసత్వము, ప్రభుత్వ నిర్లక్ష్యము కారణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయలేని అచేతన స్థితిలో రెండు సమస్యలను పరిష్కరించకుండా పదోన్నతులు నిలిపివేశారు.

 అందులో (1) నేరుగా పోటీ పరీక్ష ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగుల సీనియారిటీ మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించి పదోన్నతులు కల్పించే అంశం. (2) హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము 2 జూన్ 2014 తర్వాత కల్పించిన పదోన్నతులన్నిటిని సమీక్షించి అన్ని కేటగిరిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని లెక్కించి నష్టపోయిన బీసీ, ఓసి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశం.

2018లో జర్నయల్ సింగ్ కేసు తీర్పుల్లో తెలిపిన విధివిధానాలను ప్రతి క్యాడర్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని లెక్కగట్టి ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 2011 నుండి కల్పించిన పదోన్నతులను అన్నింటిని సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వము 2019లో అన్ని ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తూ 2 జూన్ 2014 తర్వాత కల్పించిన పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని తెలిపింది. 

అందులో భాగంగా తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పోలీసు, తదితర శాఖల్లో పదోన్నతులను సమీక్షించారు. కానీ, విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కారణాలు చూపి నేటికీ అమలు చేయలేదు. 

పదోన్నతులు సమీక్షిస్తామన్న యాజమాన్యాలు

మరోవైపు 2021 లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు పూర్తయిన వెంటనే పదోన్నతులు సమీక్షిస్తామని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశారు. డిసెంబర్ 2022లో విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసు సుప్రీంకోర్టులో విచారణ అనంతరం మూసివేశారు. విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలని 2019లో ఓసి ఉద్యోగుల సంక్షేమ సంఘం పిటీషన్ను స్వీకరించిన హైకోర్టు, విద్యుత్ సంస్థల్లో కూడా సుప్రీంకోర్టు విధివిధానాలను పదోన్నతుల్లో అమలు చేసి పదోన్నతులను సమీక్షించాలని ఆదేశించింది. 

గత సంవత్సరం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పదోన్నతుల సమీక్షపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకున్నారు, ప్రస్తుతం విద్యుత్ సంస్థల సీఎండిలపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు విచారణలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 2011 నుండి కల్పించిన పదోన్నతులను సమీక్షకు చర్యలు చేపట్టారు.

నష్టపోయిన వారికి పదోన్నతులు కల్పించాలి

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై ఉన్నటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పుడు లోకసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి న్యాయం చెయ్యాలి. అదేవిధంగా విద్యుత్ సంస్థల్లో మెరిట్ సీనియారిటీపై ఉన్న వివాదాన్ని పరిష్కరించి నేరుగా పోటీ పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన అన్ని కేడర్ల ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ఆధారంగా నిర్ధారించి వెంటనే పదోన్నతులు కల్పించాలి.

  కోడెపాక
కుమార స్వామి 
రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ 
విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం