ఆస్తి పన్ను వసూళ్లలో సిరిసిల్ల టాప్..100 శాతం వసూళ్లతో రికార్డు

ఆస్తి పన్ను వసూళ్లలో సిరిసిల్ల టాప్..100 శాతం వసూళ్లతో రికార్డు
  • అట్టడుగున వరంగల్ 
  • రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో 92.54 శాతం పన్ను కలెక్ట్
  • 12,760 జీపీల్లో రూ.345.21 కోట్లు వసూలు చేయాలని టార్గెట్, రూ.319.45 కోట్లు వసూలు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫస్ట్​ ప్లేస్​లో నిలిచింది. 100% ఆస్తిపన్ను రూ.7.96 కోట్లు కలెక్ట్​ చేశారు. 81% వసూళ్లతో వరంగల్​జిల్లా చివరి స్థానంలో ఉంది. 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల్లో 2025-–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లు తుదిదశకు చేరుకున్నాయి. ఈసారి రూ.345.21 కోట్లు వసూలుచేయాలని లక్ష్యం పెట్టుకోగా,  ఇప్పటి వరకు రూ.319.45 కోట్లు(92.54 శాతం) వసూలయ్యాయి.  కొన్ని జిల్లాలు లక్ష్యానికి చేరువలో ఉండగా, మరికొన్ని జిల్లాలు ఇంకా వెనుకంజలో ఉన్నాయి. ఆస్తి  పన్ను వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 100 శాతం వసూలయ్యాయి. జగిత్యాల, సిద్ధిపేట జిల్లాలు కూడా స్వల్ప తేడాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

సిరిసిల్ల ఫస్ట్​.. వరంగల్  లాస్ట్..

గ్రామపంచాయతీ ఆస్తి పన్నుల వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా టాప్​లో ఉండగా, వరంగల్​ జిల్లా వెనుకబడింది. సిరిసిల్ల జిల్లాలో 100శాతం ఆస్తిపన్ను(రూ.7.96 కోట్లు) కలెక్ట్​ చేసి రికార్డు సృష్టించారు.  జగిత్యాల జిల్లాలో(99.40 శాతంతో రూ.13.57 కోట్లు) వసూలు చేశారు.  సిద్దిపేట జిల్లాలో రూ.14.94 కోట్లతో 99.35 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రూ.14.16 కోట్లతో 97.22  శాతం, హన్మకొండ జిల్లాలో  రూ.5.60 కోట్లతో 96.21 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. వసూళ్లలో వరంగల్  జిల్లా అత్యంత వెనుకబడింది. ఇక్కడ 81.21 శాతం మాత్రమే వసూలు కాగా.. మహబూబాబాద్  జిల్లా 82.71 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు జారీ చేసినా ఆశించినస్థాయిలో వసూళ్ల కావడం లేదు. వరంగల్  జిల్లా రూ. 4.04 కోట్లు(81.21 శాతం), మహబూబాబాద్  జిల్లాలో రూ.4.44 కోట్లు(82.71) శాతం, జయశంకర్  భూపాలపల్లి జిల్లాలో రూ.3.75 కోట్లు(88.03 శాతం), నాగర్ కర్నూల్  జిల్లాలో రూ.6.67 కోట్లు( 88.08 శాతం) సూర్యాపేట జిల్లాలో  రూ. 11.22 కోట్లు(88.82 శాతం) వసూలైంది.  

ఇంకా రూ.25 కోట్లు బాకీ..

రాష్ట్రవ్యాప్తంగా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.33.74 కోట్ల డిమాండ్  ఉండగా, రూ.30.64 కోట్లు వసూలైంది. నిజామాబాద్  జిల్లాలో రూ.28.20 కోట్లకు గాను, రూ. 25.50 కోట్లు కలెక్ట్  చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా రూ.25.76 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ నెల చివరి నాటికి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సంబంధిత ఆపీసర్లు పంచాయతీ కార్యదర్శులకు టార్గెట్లు విధిస్తున్నారు. తక్కువ పర్సంటేజీ ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

శిథిలావస్థలో ఉన్న గృహాలకూ పన్నులు వసూలు..

గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న గృహాలు, నివాసయోగ్యం కాని ఇండ్లు, కొన్నేండ్లుగా ఖాళీగా ఉంటున్న ఇండ్లుకు కూడా పన్నులు విధించినట్లు తెలిసింది. దీని వల్ల పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయే తప్ప.. వాటిని చెల్లించేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని సమాచారం. 2020లో నాన్​ అగ్రి ప్రాపర్టీ బుక్(ఎన్​పీబీ) సర్వే  చేశారు. ఇంటింటికి కెళ్లి ఫొటో తీసి ఈ–పంచాయతీ పోర్టల్​లో ఆన్​లైన్​ చేశారు. దీంతో ఆ ప్రాపర్టీ బుక్​లో నమోదైంది. అప్పటి నుంచి పన్నులు వేస్తున్నారు. 

అయితే, దీన్ని రికార్డుల నుంచి తొలగించాలంటే గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో గుర్తించి రికార్డుల నుంచి తొలగించాలని గ్రామసభలో తీర్మానం చేయాలి. ఆపై డీపీవోకు పంపిస్తే అక్కడి నుంచి పంచాయతీరాజ్​ కమిషనర్​ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ కమిషనర్​ నిర్ణయం మేరకు ఇలాంటి గృహాలను రికార్డుల నుంచి తొలగిస్తారు. ఇలా చేయకపోవడంతో శిథిలావస్థలో ఉన్న గృహాలకు ట్యాక్స్​ విధించడంతో గ్రామాల్లో 100 శాతం లక్ష్యం నెరవేరడం లేదని సమాచారం. గతంలో గుడిసెలు, పెంకుల ఇండ్లు ఉన్నవాళ్లు ప్రస్తుతం భవనాలు నిర్మించుకున్నారు. వాటికి ఇంటి పన్ను వాల్యూలో మార్పు ఉండట్లేదని కార్యదర్శులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు : 12,760
పన్ను వసూలు లక్ష్యం : రూ.345.21 కోట్లు
వసూలైన మొత్తం : రూ.319.45 కోట్లు
మిగిలిన బ్యాలెన్స్ : రూ.25.76 కోట్లు
రాష్ట్ర సగటు : 92.54 శాతం