సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు నిరసన సెగ

సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు నిరసన సెగ

బెల్లంపల్లి రూరల్​, వెలుగు: ఓట్లు అడిగేందుకు వెళ్లిన సిర్పూర్​ఎమ్మెల్యే, అధికార పార్టీకి చెందిన కోనేరు కోనప్పకు గ్రామస్తుల నుంచి నిరసన ఎదురైంది. సిర్పూర్​ నియోజకవర్గంలోని భీమిని మండలం చిన్నగుడిపేటకి ఎమ్మెల్యే కోనప్ప మంగళవారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు. విషయం తెలుసుకున్న  గ్రామస్తులు ఆయనను రోడ్డుపైనే అడ్డుకొని నిరసన తెలిపారు. 

గత ఎన్నికల్లో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏమీ చేయలేదని, రోడ్డుపై బైక్​లను అడ్డంగా పెట్టి కోనప్పను అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి వాహనాలను తొలగించినప్పటికీ గ్రామస్తులు మాత్రం ప్రచారం చేయకుండా అడ్డుపడ్డారు. చేసేదేమీలేక కోనప్ప వెనుదిరిగారు. ఈ తతంగాన్ని అంతా యువకులు వీడియో  తీస్తుండగా ఎమ్మెల్యే గన్​మెన్లు సెల్​ఫోన్​లను లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు.