జనావాసాల మధ్య పెట్టిన వైన్ షాపులు మార్చాలని ఆందోళన

 జనావాసాల మధ్య పెట్టిన వైన్ షాపులు మార్చాలని ఆందోళన

కమలాపూర్, వెలుగు :  జనావాసాల మధ్య పెట్టిన వైన్ షాపులను వేరే చోటకు మార్చాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్  మండల వ్యాప్తంగా డిసెంబర్ 1  నుంచి కొత్త వైన్  షాపులను ప్రారంభించారు. మండలంలో మొత్తం ఏడు మద్యం దుకాణాలు ఉండగా అవన్నీ ప్రజలు తిరిగే చోట ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మందుబాబులు వైన్ షాపుల పక్క వీధుల్లో మూత్ర విసర్జన చేస్తున్నారని, దీంతో మహిళలకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వైన్  షాపును ఏర్పాటు చేయడం వల్ల రోగులు ఇక్కడ చెట్ల కింద సేదతీరాలన్నా ఇబ్బందిగా మారిందని తెలిపారు. వెంటనే వైన్  షాపులు తొలగించాలని వారు డిమాండ్  చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేవని మండిపడుతున్నారు.

పరకాలలో కూడా..

పరకాల, వెలుగు :  హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఏర్పాటు చేసిన వైన్ షాపును తొలగించాలని కాలనీవాసులు శనివారం ధర్నా చేశారు. కొత్త మద్యం పాలసీలో భాగంగా భూపాలపల్లి ప్రధాన రోడ్డు మార్గంలో వైన్స్  షాపు ఏర్పాటు చేశారు. ఈ దుకాణానికి 70 మీటర్ల దూరంలోనే కనకదుర్గమ్మ గుడి ఉందని, ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. ఎక్సైజ్​ అధికారులు చొరవ తీసుకుని దుకాణాన్ని ఇతర ప్రదేశానికి మార్చాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.