మా ఇంటికేసిన తాళాలు తీయండని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన

మా ఇంటికేసిన తాళాలు తీయండని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన

ఖమ్మం టౌన్, వెలుగు : తమ డబుల్​ బెడ్​ రూమ్​ఇండ్లకు వేసిన తాళాలు తీయాలని డిమాండ్​ చేస్తూ 20 కుటుంబాల సభ్యులు మంగళవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్​ ఇండ్ల సముదాయంలో గత ప్రభుత్వం కొంత మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. 

ఇండ్లలో నివసిస్తూ ఖమ్మం నగరంలో పనుల నిమిత్తం వెళ్తుంటామని చెప్పారు. మరి కొందరు పిల్లల చదువు కోసం, అనారోగ్యం బారినపడి హాస్పిటల్ లో ఉండాల్సి వస్తే ఇండ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని తెలిపారు. దీనిని అధికారులు సాకుగా చూపి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటికి వేసి ఉన్న తాళంపై మరో తాళం వేయడం, నోటీసులు అంటించడం సరికాదన్నారు. 20 రోజులుగా ఇండ్లకు వేసిన తాళాలు తీయాలని వేడుకుంటున్నా తహసీల్దార్ పట్టించుకోవడంలేదని వాపోయారు. 

డబుల్ బెడ్ రూమ్​ఇండ్లలో నివాసం ఉంటున్నట్లు ఆధార్, రేషన్ కార్డు, నివాస ధ్రువీకరణ, ఓటర్ కార్డు, గ్యాస్ లాంటి వాటిని చూపాలని తహసీల్దార్​ చెబుతున్నారని, తమకు కొంత సమయం ఇస్తే వాటిని ఈ ఇండ్లపై మార్చుకుంటామని చెబుతున్నారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నిరసన తెలిపిన వారిలో భాగ్యలక్ష్మి, అనిత, తిరుపతమ్మ, ప్రమీల, రమాదేవి, అనూష, సూరమ్మ, తదితరులు ఉన్నారు.