ఢిల్లీ అల్లర్లపై లోక్ సభలో లడాయి

ఢిల్లీ అల్లర్లపై లోక్ సభలో లడాయి

న్యూఢిల్లీ, వెలుగు: సోమవారం తిరిగి ప్రారంభమైన బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు.. తొలిరోజే టెన్షన్ల మధ్య సాగాయి. ఢిల్లీ అల్లర్లపై లోక్​సభ, రాజ్యసభల్లో లొల్లిలొల్లి జరిగింది. లోక్​సభలో అయితే ఏకంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ అల్లర్లను అడ్డుకోవడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫెయిల్ అయ్యారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సమయంలో రెండు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. సభ మూడు సార్లు వాయిదా పడినా పరిస్థితి మారలేదు. దీంతో మంగళవారం వరకు లోక్​సభను అడ్జర్న్ చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే. అంతకుముందు ఢిల్లీ గొడవల​పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ రెండు సభల్లోనూ స్పీకర్, చైర్మన్​కు అపొజిషన్ పార్టీల లీడర్లు నోటీసులు ఇచ్చారు.

వెల్ లోకి దూసుకెళ్లి…

మధ్యాహ్నం 2 గంటలకు లోక్​సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నల్లటి బ్యానర్ చేతబట్టిన అపొజిషన్ మెంబర్లు.. ట్రెజరీ బెంచీల వద్దకి వెళ్లారు. స్పందించిన పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి ప్రహ్లాద్ జోషి.. ప్రతిపక్ష సభ్యులు వికృతంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభను కొనసాగించాలని స్పీకర్‌ను కోరారు. ‘‘1984 అల్లర్లలో 3 వేల మందిని చంపారు. కానీ వారిపై ఎలాంటి దర్యాప్తు జరగలేదు. శాంతిని నెలకొల్పడమే ఎవరికైనా తొలి ప్రాధాన్యత. కానీ వాళ్లు టెన్షన్లను క్రియేట్ చేశారు” అని మండిపడ్డారు. వెంటనే స్పందించిన ఓం బిర్లా.. వెల్​నుంచి వెళ్లి తమ సీట్లలో కూర్చోవాలని ప్రతిపక్ష సభ్యులను కోరారు. కానీ వారు వినలేదు.

నల్లబ్యానర్ పట్టుకుని.. పేపర్లు చింపేసి..

‘విద్వేష ప్రసంగాలను ఆపండి, మన ఇండియాను కాపాడండి’ అని కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లుపై బీజేపీ ఎంపీ, ప్రభుత్వ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్, రవ్​నీత్ సింగ్ బిట్టు బ్లాక్ బ్యానర్ పట్టుకుని అక్కడి వెళ్లారు. ఇదే సమయంలో బీజేపీ సభ్యులు రమేశ్ బిధురి, నిశికాంత్ దూబే.. వెల్​లోకి వెనక్కి వెళ్లిపోవాలని వారిని కోరారు. కానీ కాంగ్రెస్ సభ్యులు.. పేపర్లు చింపి గాల్లోకి విసిరారు. దీంతో సీరియస్ అయిన మరికొందరు బీజేపీ మెంబర్లు కాంగ్రెస్ నేతల దగ్గరికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో రెండు పార్టీల నేతలు తోసుకున్నారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సభను 3 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. గొడవ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సభలోనే ఉన్నారు. 3 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే.. వెల్​లో తమ సీట్ల వైపు వెళ్లే దారిలో బీజేపీ మెంబర్లు అడ్డుగా నిలబడ్డారు. స్పీకర్ సీట్లో కూర్చున్న బీజేపీ నేత రమాదేవి.. సభను 4 గంటలకు వాయిదా వేశారు. గొడవ కొనసాగడంతో 4.30కి అడ్జర్న్ చేశారు.

పోటాపోటీ స్లోగన్లు..

‘దేశ్ కీ రక్షా కౌన్ కరేంగే.. హమ్ కరేంగే హమ్ కరేంగే’, ‘మహాత్మా గాంధీ అమర్ రహే.. నక్లీ గాంధీ జైల్​మే రహే’ అని బీజేపీ నేతలు నినాదాలు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యులు ‘మాకు న్యాయం కావాలి’, ‘షా ముర్దాబాద్’ అంటూ స్లోగన్లు ఇచ్చారు.

దేశం చూస్తోంది.. కూర్చోండి: స్పీకర్ ఓం బిర్లా

‘‘మీ పార్టీ సభ్యులను వెళ్లి వాళ్ల సీట్లలో కూర్చోమని చెప్పండి. దేశ ప్రజలు (సభ కార్యక్రమాలను) చూస్తున్నారు” అని అపోజిషన్ లీడర్లను స్పీకర్ ఓం బిర్లా కోరారు. ‘‘ఇది డెమోక్రసీకి దేవాలయం. కొన్ని రూల్స్, సంప్రదాయాలు ఉన్నాయి. మీరు వెల్​లోకి రాకూడదు. ప్రశాంతతను కాపాడటం మీ బాధ్యత” అని అన్నారు.‘‘మనం సభ గౌరవాన్ని కాపాడాలి. ఇది ప్రతి సభ్యుడికి చెందినది’’ అని కోరారు. ‘‘సభలో జరిగిన దానికి బాధపడుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో సభను నిర్వహించాలని అనుకోవడం లేదు. సీనియర్ సభ్యులు సహకరించాలి” అని చెబుతూ లోక్​సభను మంగళవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ అంతే..

ఢిల్లీ అల్లర్ల అంశంపై రాజ్యసభలోనూ నిరసనలు జరిగాయి. ప్రొసీడింగ్స్ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. కాంగ్రెస్, ఆప్, లెఫ్ట్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే సహా ప్రతిపక్ష పార్టీలు ప్రొటెస్ట్ చేశాయి. స్లోగన్లు ఇచ్చాయి. హింసను అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించాయి. సమస్య ముఖ్యమే, ఆ తర్వాత చర్చిద్దామని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కోరారు. సభ్యులు వినకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభం కాగా.. ముగ్గురు సభ్యులు కళ్లకు గంతలు కట్టుకోవడంతో వాటిని తీసేయాలని, అలా చేయడం సభా గౌరవం కాదని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు.

ఎవరికి వారే ప్రొటెస్టులు..

ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్, ఆప్, టీఎంసీ ఎంపీలు వేర్వేరుగా ప్రొటెస్టులు చేశారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలంతా ఆందోళన చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిలతో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.

ఢిల్లీ తగలబడుతుంటే..: అధిర్

‘‘ఒకవైపు ఢిల్లీ తగలబడుతుంటే.. హోంమంత్రి అహ్మదాబాద్​లో ఆతిథ్యం ఇస్తున్నారు. ఆతిథ్యం ఇచ్చుకోండి.. పుచ్చుకోండి.. కానీ ఇక్కడ ఇండియన్లు చనిపోతున్నారు. అదే మొదటి ప్రాధాన్యం కావాలి కదా’’ అని ‘నమస్తే ట్రంప్’ ప్రోగ్రామ్​ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు.

లోక్సభలో మరిన్ని..

కొంతమంది ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ టేబుల్‌పై ‘అమిత్ షా రాజీనామా చేయాలి’ అని రాసి ఉన్న ప్లకార్డ్ ఉంచారు. దాన్ని సిబ్బంది వెంటనే తొలగించారు. బీజేపీ ఎంపీ జస్​కౌర్ మీనా తనపై దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ ఆరోపించారు. స్పీకర్​కు ఫిర్యాదు చేశారు.

అబార్షన్లు చేయించుకునేందుకు ఉన్న లిమిట్​ను 24 వారాలకు పెంచేందుకు ఉద్దేశించినమెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ (అమెండ్​మెంట్) బిల్లును కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సభ ముందు ఉంచారు.

మినరల్ చట్టాల సవరణ బిల్లు కూడా సభలో ప్రవేశపెట్టారు.

డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ బిల్లును సభ పరిశీలన, ఆమోదానికి పంపారు.

మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రవేశపెట్టారు.