మయన్మార్‌‌‌‌‌‌‌‌లో మిన్నంటిన నిరసనలు.. అపార్ట్‌‌మెంట్‌‌పై పోలీసుల కాల్పులు..

మయన్మార్‌‌‌‌‌‌‌‌లో మిన్నంటిన నిరసనలు.. అపార్ట్‌‌మెంట్‌‌పై పోలీసుల కాల్పులు..
  • కన్పిస్తే కాల్చిపారేస్తాం!
  • మయన్మార్‌‌‌‌‌‌‌‌లో టిక్‌‌‌‌‌‌‌‌టాక్ వీడియోలతో సోల్జర్లు, పోలీసుల హల్‌‌‌‌‌‌‌‌చల్ 
  • నిరసనలను అణిచేందుకు సోషల్ మీడియాను వాడుతున్న ఆర్మీ
  • బుధవారం ఒక్కరోజే 38 మందిని కాల్చి చంపిన పోలీసులు

నేపిడా: ‘‘ఈ రోజు రాత్రి నేను సిటీ అంతా పెట్రోలింగ్ కు వెళుతున్నా. డైరెక్ట్ మీ మొఖాల మీదే రియల్ బుల్లెట్లతో కాలుస్తా. నాకు ఎవరు కన్పిస్తే వాళ్లను కాల్చి పారేస్తా. చావాలనుకుంటే రండి. మీ కోరిక నెరవేరుస్తా”… మయన్మార్ లో యూనిఫాం వేసుకున్న ఓ సోల్జర్ టిక్ టాక్ లో రిలీజ్ చేసిన వీడియో ఇది. సోల్జర్లు, పోలీసులు ఇలా యూనిఫాంలు వేసుకుని, గన్స్ చేతుల్లో పట్టుకుని నిరసనకారులను బెదిరిస్తూ పోస్ట్ చేసిన డజనుకు పైగా టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయని ‘రాయిటర్స్’ మీడియా సంస్థ వెల్లడించింది. మిలటరీ తిరుగుబాటు నేపథ్యంలో రూల్స్ స్ట్రిక్ట్ చేసిన ఫేస్ బుక్ ఆర్మీ పేజీలను తొలగించడంతో ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై మిలటరీ రూలర్స్ ఫోకస్ పెట్టారని తెలిపింది. అయితే మిలటరీకి అనుకూలంగా ఏకంగా 800 వీడియోలు రిలీజ్ అయ్యాయని మయన్మార్ ఐసీటీ ఫర్ డెవలప్ మెంట్ సంస్థ వెల్లడించింది.  అయితే హింసను ప్రేరేపించే అన్ని రకాల కంటెంట్ ను తాము తొలగిస్తున్నామని, గన్స్ పట్టుకుని బెదిరించడం వంటివన్నీ తమ రూల్స్ కు విరుద్ధమని టిక్ టాక్ తెలిపింది.

నెలలో 50 మందికి పైగా బలి

ఆర్మీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకూ వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 38 మందిని పోలీసులు కాల్చి చంపినా.. గురువారం మళ్లీ నిరసనకారులు ధైర్యంగా రోడ్లపైకి వచ్చారు. యాంగన్, మాండలే, తదితర సిటీల్లో భారీగా నిరసనలు చేపట్టిన ప్రజలు.. ఆంగ్ సాన్ సూకీ, ఇతర నేతలను రిలీజ్ చేయాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తిరిగి అధికారం అప్పగించాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటివరకూ 50 మందికి పైగా నిరసనకారులను ఆర్మీ, పోలీసులు కాల్చి చంపారని మీడియా సంస్థలు వెల్లడించాయి.

అపార్ట్‌‌మెంట్‌‌పై కాల్పులు..
తుపాకులు ఎక్కుపెట్టి భయపెడతారని అనుకుంటున్నరా .. నిజంగానే కాల్పులు జరుపుతున్నరు. మయన్మార్ లో సైనిక తిరుగుబాటుపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. జనం వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు హెచ్చరించినా.. వెనక్కి తగ్గట్లే. గురువారం యాంగన్‌‌లోని
అపార్ట్‌‌మెంట్ లో ఉన్న ఆందోళనకారులపై పోలీసులు ఇలా కాల్పులు జరిపారు.

జుంటాపై గట్టి చర్యలు తీస్కోవాలె: యూఎన్ స్పెషల్ ఎన్వాయ్

మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అణిచివేతలకు పాల్పడుతున్న జుంటా (మిలటరీ సర్కార్)పై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రపంచ దేశాలన్నీ గట్టి చర్యలు తీసుకోవాలని మయన్మార్ లో యూఎన్ స్పెషల్ ఎన్వాయ్ క్రిస్టీన్ ష్క్రానర్ బర్గెనర్ అన్నారు.

ఫైరింగ్ వీడియోలు వైరల్

మయన్మార్ లో నిరసనకారులను పోలీసులు, సోల్జర్లు వెంటాడి మరీ కాల్పులు జరిపిన వీడియోలు, ఫొటోలు సోషల్‌‌ మీడియాలో వైరల్ గా మారాయి. బుధవారం ఓ నిరసనకారుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చడం, ఒక్కరోజే 38 మందిని బలితీసుకోవడం, నిరసనకారులను దారుణంగా కొడుతూ తరమడం, చివరకు అంబులెన్స్ సిబ్బందిని సైతం పోలీసులు చితకబాదడం వంటి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.