బంగ్లాదేశ్లో లక్షమందితో భారీ నిరసన ర్యాలీ..ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్

బంగ్లాదేశ్లో లక్షమందితో భారీ నిరసన ర్యాలీ..ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్

బంగ్లాదేశ్: ప్రధాని పదవికి షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ లో భారీఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ బీఎన్ పీ, దాని మిత్ర పక్షాలు రాజాధాని ఢాకాలో లక్షలాది మంది ప్రజలతో భారీ ర్యాలీని నిర్వహించారు. శనివారం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఓ పోలీస్ అధికారి మృతిచెందగా దాదాపు వంద మందికి పైగా గాయపడ్డారు. నిరసన కారులు డజన్ల కొద్ది వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 

నిరసనలు హింసాత్మకంగా మారడానికి కారణం

ప్రధాని హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష  పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP),దాని మిత్ర పక్షాలు శనివారం పిలుపునిచ్చాయి.ప్రధాని రాజీనామా చేసి ఆపద్ధర్మ ప్రభుత్వం జనవరిలో జరిగే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశాయి. హసీనా ప్రభుత్వంలో అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన పెరిగిపోయిందని ఆరోపించాయి. అయితే షేక్ హసీనా వారి డిమాండ్ ను తిరస్కరించింది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఎన్నికలు నిర్వహిస్తామని హసీనా అన్నారు.  

ఢాకాలో లక్షలాది మంది నిర్వహించిన ర్యాలీపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్లే శాంతియుతంగా సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయని ప్రతిపక్ష పార్టీల నేతల అంటున్నారు. పేలుళ్లు, కాల్పులతో ఆ ప్రాంతాన్ని  యుద్ధభూమిలా మార్చాయి.   పోలీసుల చర్యలకు నిరసనగా బీఎన్ పీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. 

ఇది హసీనా రాజీనామాకు చివరి పిలుపు..హసీనా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని.. సమ్మెలు, దిగ్భంధనాలతో నిరసనలను ఉధృతం చేస్తామని ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి.