పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ

పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్  రగడ

కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా తాడూరు మండలం సిర్సవాడలో ఆదివారం జడ్పీ హైస్కూల్​ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పై గొడవ జరిగింది. మాజీ ఎమ్మెల్యే స్కూల్​ను ప్రారంభించడం గందరగోళానికి దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి.. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి తన ఎంజేఆర్​ ట్రస్ట్​కు చెందిన రూ.50 లక్షల ఫండ్స్​తో 2022లో కొత్త స్కూల్​ బిల్డింగ్​కి శంకుస్థాపన చేశారు.​ 

పనులు పూర్తి కావడంతో ఆదివారం స్కూల్​ను ప్రారంభించాల్సి ఉంది. ముందుగా మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి స్కూల్​ గేట్​ వద్ద ఏర్పాటు చేసిన రిబ్బన్​కట్​ చేసి, గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే రాజేశ్​రెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చారు. అప్పటికే స్కూల్​ను మాజీ ఎమ్మెల్యే ప్రారంభించినట్లు గుర్తించి డీఈవో గోవిందరాజులు, స్కూల్ హెచ్ఎంను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు డీఈవో గోవిందరాజులు, మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు కలగజేసుకొని వారిని సముదాయించి, డీఈవోకు భద్రత కల్పించి అక్కడి నుంచి పంపించారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్కూల్​ను ప్రారంభించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ స్కూల్​ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, ఎంజేఆర్  చారిటబుల్  ట్రస్ట్  అధినేత మర్రి జనార్దన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా 2022లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారని, ఈ విషయంలో అధికారులకు ఎలాంటి సంబంధం లేదన్నారు.