
- కరెంటు అవసరాలకు ప్రత్యామ్నాయంగా తెచ్చే యోచన
- సబ్సిడీతో గృహవినియోగదారులను ప్రోత్సహించే ప్రయత్నం
- ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన రెడ్కో
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అటు సాగుకు, ఇటు గృహవినియోగం రోజు రోజుకు పెరిగిపోతున్నది. దీంతో రాష్ట్ర సర్కారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. సోలార్ పవర్‌ను ప్రోత్సహించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకునే వారికి ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది.
ఇప్పటికే రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశాలు ఇచ్చారు. రెడ్కో భాగస్వామ్యంతో రాష్ట్రంలో వ్యక్తిగత వినియోగదారులకు భారీగా ప్రోత్సాహం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పుడున్న సోలార్ జనరేషన్ సామర్థ్యాన్ని రెట్టింపు స్థాయికి తీసుకువెళ్లాలని సర్కారు భావిస్తోంది.
సర్కారు సబ్సిడీ..
ఒక మెగావాట్ నుంచి మూడు మెగావాట్ల ఉత్పత్తి సోలార్ ప్యానల్స్ పెట్టుకునే వారికి ప్రోత్సాహం కల్పించే ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. గృహ వినియోగదారులకు ఒక కిలో వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.18 వేల సబ్సిడీ ఇస్తుంది. మూడు కిలో వాట్స్ నుంచి పది కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు రూ.9 వేల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ సోలార్ సబ్సిడీ పై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించి సోలార్ పవర్ సామర్థ్యాన్ని పెంచనుంది. సోలార్‌తో కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత కరెంటు ఉత్పత్తి పరిస్థితి..
ప్రస్తుతం తెలంగాణ జెన్‌కో సొంతంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 6,485.30 మెగావాట్లు మాత్రమే ఉంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు 4000 మెగావాట్లు, భవిష్యత్తులో మరో ఏడాదిలో అందుబాటులోకి వస్తుందనే ఆశతో జెన్‌కో ఉంది. వీటి నుంచి కొద్దో గొప్పో విద్యుత్ ఉత్పత్తి సాధించవచ్చనే భావనలో జెన్‌కో ఉంది. ఎన్‌టీపీసీ, సెంట్రల్ పవర్‌స్టేషన్‌లలో రాష్ట్ర వాటా 3186.76 మెగావాట్లు, అలాగే చత్తీస్‌గఢ్ కొనుగోళ్ల ఒప్పందాల ద్వారా 1000 మెగావాట్లు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి నుంచి1200 మెగావాట్లు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5600 మెగావాట్లు, గ్యాస్ 807.31 మెగావాట్లు, సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా మరో 256.24 మెగావాట్లు ఇలా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 19,475 మెగావాట్ల కాంట్రాక్ట్ విద్యుత్ సామర్థ్యం ఉంది.
కాంట్రాక్ట్ ఒప్పందాలు ఉన్నప్పటికీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎంత విద్యుత్ వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో వేసవి విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం యాసంగి సీజన్లో రోజు వారీగా13 వేల మెగావాట్లకు పైగా డిమాండ్ ఉన్నది. వేసవిలో మరింత డిమాండ్ పెరగనుంది. ఇప్పటి వరకు గత మార్చి నెలలో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,497 మెగావాట్లు కాగా, ఈ సంవత్సరం ఆ రికార్డును బ్రేక్‌చేసే అవకాశం లేకపోలేదు. అందుకే కరెంట్క్రైసిస్ నుంచి బయటపడేందుకు సులభమైన ప్రత్యామ్నాయం సోలార్ పవర్ మాత్రమేనని సర్కారు భావిస్తోంది.