
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దశాబ్దకాలం నుంచి పునరుత్పాదకశక్తి వనరుల మీద విధానాలు, ఆర్థికవనరులు కేంద్రీకరించాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే కాలుష్యం మీద ప్రపంచవ్యాప్త ఆందోళన, రెండోది సౌరశక్తి ఉత్పత్తి ఖర్చు భారీగా తగ్గడం. పునరుత్పాదక శక్తివనరులు చాలా రకాలు ఉన్నాయి.
కొన్ని పరిశోధన స్థాయిలో ఉండగా, కొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అందులో మొట్టమొదటిది సౌరశక్తి. సూర్యరశ్మి నుంచి శక్తి ఉత్పత్తి చేసే సాధనాలు వచ్చిన తరువాత అనేక మార్పులు వచ్చాయి. మొదట్లో ఖరీదు అయిన ఈ పరికరాలు రానురాను తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఫలితంగా సౌర శక్తి ఉత్పత్తి మీద ఆసక్తి పెరిగింది. పెట్టుబడులు పెరిగినాయి.
ప్రభుత్వాల శక్తి విధానాలలో ప్రముఖ స్థానం పొందింది. అన్ని శక్తి వనరులకు ఏదో ఒక పరిమితి ఉంది. సౌరశక్తి సూర్యుడు ఉన్నప్పుడే అందుబాటులోకి వస్తుంది. సూర్యరశ్మి రోజంతా, అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండదు. రాత్రి, తెల్లవారుజామున, సాయంకాలం సూర్యరశ్మి ఉండదు. అవి ఎప్పటికప్పుడు మారితే ఆ ప్రకారం సౌరశక్తి ఉత్పత్తిలో కూడా హెచ్చుతగ్గులు ప్రతిఫలిస్తాయి.
పర్యావరణం మీద దుష్ప్రభావం
బొగ్గుతో కాలుష్యం ఉండగా, ఇతర శక్తివనరుల వాళ్ళ పర్యావరణం మీద దుష్ప్రభావం కూడా ఒక ప్రాథమిక కొలమానంగా తీసుకుంటే, అన్నింటినీ మించి సౌరశక్తికే సానుకూల పరిస్థితి ఉంది. సౌరశక్తి వల్ల కూడా పర్యావరణ దుష్ప్రభావం ఉంటుంది. విస్తార, కేంద్రీకృత సౌరశక్తి కేంద్రాలకు భూమి కావాలి.
సౌర ఫలకాలు ఒక కోణంలో అత్యధికంగా సౌరశక్తిని గ్రహించేవిధంగా ఏర్పాటు చేయడానికి తగిన ప్రదేశం, విస్తీర్ణం కావాలి. సౌర ఫలకాలు శాశ్వతంగా ఉండవు. పరిశ్రమ ప్రమాణం ప్రకారం చాలా సౌరఫలకాల జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాలు. పాడయిపోయిన, పగిలిపోయిన పాత సౌర శక్తి ఫలకాలు నిరుపయోగం అయ్యి ‘చెత్తగా’ మిగిలిపోతున్నాయి. వాటిని ఎక్కడపడితే అక్కడ పారేయడం వల్ల కూడా కాలుష్యం అవుతున్నది.
సౌర ఫలకాల ఉత్పత్తికి అవసరమైన ముడి ఖనిజాల మైనింగ్ కూడా ఒక పర్యావరణ, ఆర్థిక, సామాజిక సమస్యగా గుర్తిస్తున్నారు. సౌర ఫలకాల ఉపరితలం సూర్య కాంతిని, వేడిని ఎక్కువగా గ్రహించే విధంగా డిజైన్ చేస్తారు. అయినా కూడా వచ్చే సూర్యరశ్మిలో కేవలం 15% మాత్రమే విద్యుత్తుగా మార్చబడుతుంది. మిగిలినది వేడిగా పర్యావరణానికి తిరిగి వస్తుంది. భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న సౌర క్షేత్రాల సౌరఫలకల సమూహాలు అధికంగా వేడిని గ్రహిస్తాయి. విడుదల చేస్తాయి. ఈ కృత్రిమ వేడి వల్ల చుట్టుపక్కల పర్యావరణంపై ప్రభావం ఉంటుంది.
అగ్రివోల్టాయిక్స్
వ్యవసాయ భూములపై సౌర ఫలకాలను తరచుగా అగ్రివోల్టాయిక్స్ అని పిలుస్తారు. ఇందులో సౌరశక్తి వ్యవస్థలు, వ్యవసాయ కార్యకలాపాలు ఒకేసారి చేయవచ్చు అని భావిస్తారు. ఈ పద్ధతి ద్వారా భూమిపై వ్యవసాయ ఉత్పాదకతను కొనసాగిస్తూ స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పరిశ్రమ భావిస్తున్నది.
ఫోటోవోల్టాయిక్ ప్యానెల్‌ల క్రింద పంటలను పెంచడం వల్ల నేలలో తేమ, తీవ్రమైన వాతావరణ సంఘటనల నుంచి రక్షణ, కొన్ని పరిస్థితులలో మెరుగైన పంట పెరుగుదల వంటి ప్రయోజనాలు లభిస్తాయని కొన్ని రకాల పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, వ్యవసాయ భూములపై సౌరశక్తి కేంద్రాల విస్తరణ ఆందోళనలను కూడా రేకెత్తిస్తున్నది.
అమెరికాలో అత్యంత ఉత్పాదక వ్యవసాయ భూములు సౌరశక్తి అభివృద్ధి కోసం తీసుకుంటారు అని ఆందోళన చెందుతున్నారు. దీనివలన సారవంతమైన నేల క్షీణించడం, తద్వారా వ్యవసాయ ఉత్పాదకతను కోల్పోతామని ఆందోళన ఉన్నది. అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో భారీ సౌరశక్తి కేంద్రాల కోసం కిరాయికి తీసుకున్న వ్యవసాయ భూముల గణనీయమైన నేల కోతను గుర్తించారు.
సౌర విద్యుత్ సామర్థ్యంలో 5వ స్థానం
2050 నాటికి అమెరికాకు 10 మిలియన్ ఎకరాల సౌర ఫలకాలు అవసరమని అమెరికా ఇంధన శాఖ అంచనా వేసింది. అయితే విస్తరణకు 2035 నాటికి 0.3% వ్యవసాయ భూమిని మాత్రమే సౌరశక్తికి ఉపయోగించాలని భావిస్తున్నారు. ఈ విధంగా అక్కడి ప్రభుత్వం కనీసం ఒక భూమి మీద పరిమితి పెట్టింది.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్త స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యంలో 5వ స్థానంలో ఉంది. - 84 GW స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిలిచింది. 2030 నాటికి 500 GW పునరుత్పాదక సామర్థ్యాన్ని సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు 280 GW సౌరశక్తి సామర్థ్యానికి చేరాలని ప్రభుత్వం భావిస్తున్నది.
అయితే, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి భారతదేశ భూభాగంలో 75,000 చదరపు కిలోమీటర్ల భూమిని సౌర ఉత్పత్తి కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుత సౌర సామర్థ్యంలో దాదాపు 81 శాతం భూమిని ఉపయోగించుకునే గ్రౌండ్-మౌంటెడ్ ఇన్‌స్టాలేషన్‌ల నుంచి వస్తుంది. సాధారణంగా సౌర ప్రాజెక్టులకు ప్రతి మెగావాట్‌కు 3-5 ఎకరాల మధ్య భూమి అవసరం.
వ్యవసాయ భూమిని రక్షించాలి
సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం భూమి వినియోగ మార్పు, భూసేకరణ, మారుతున్న భూమి యాజమాన్యం, సౌర ప్రాజెక్టుల ఏర్పాటుపై స్థానిక కుటుంబాలతో ఏర్పడుతున్న వివాదాల తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
రెండు లక్ష్యాల మధ్య దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం మీద కొన్ని ప్రమాణాలు, సూచికలతో కూడిన మార్గదర్శకాలు తయారు చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల వ్యవసాయ యోగ్య భూమి తక్కువ ఉన్నప్పుడు ఆ భూమిని రక్షించడం ప్రథమ కర్తవ్యం. వికేంద్రీకృత సౌరశక్తి ఉత్పత్తి అందరికీ ప్రయోజనకరం. పట్టణ ప్రాంతాలలో భూమి వినియోగ విధానంతోపాటు బిల్డింగ్ రూఫ్ టాప్ వినియోగ విధానం కూడా రావాలి. వ్యవసాయ భూమి పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
విధానపర చర్చ చేయడం లేదు
ప్రధానంగా వ్యవసాయ భూములపై సౌరశక్తి అభివృద్ధి ఆందోళన కలిగిస్తుందని కొందరు వాదిస్తుండగా, మరికొందరు దీనిని రైతుల ఆదాయాన్ని వైవిధ్యపరచడానికి, పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు. అయితే వ్యవసాయ భూముల కొరకు సౌరశక్తి విస్తరణ ఘర్షణ పడుతుండగా, ఆహార భద్రతకు ఆలవాలమైన వ్యవసాయం భవిష్యత్తు గురించి ఆయా ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే ఆందోళన పెరుగుతున్నది.
స్పాట్సిల్వేనియా సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఉత్తర వర్జీనియాలో దాదాపు 6,350 ఎకరాలలో విస్తరించింది. అడ్వాన్స్‌డ్ ఎనర్జీ ప్రకారం నార్త్ కరోలినాలో 31,125 ఎకరాల్లో దాదాపు 670 సౌర విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సౌరశక్తి కేంద్రాల విస్తరణకు ప్రభుత్వాలు ఇతోధిక సహాయం వివిధ రూపాలలో చేస్తున్నందున వ్యవసాయ భూమి మార్పిడి చాల సులభంగా అవుతున్నది.
2020లో ప్రపంచ సౌర మార్కెట్ 422 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. సౌర శక్తి కేంద్రాల ఫలకాలు, సంబంధిత విద్యుత్ గ్రిడ్, విద్యుత్ సరఫరా వ్యవస్థ.. వ్యవసాయ యోగ్య భూములను వాడుకుంటున్నది. దీనిమీద మన దేశంలో విధానపర చర్చ చేయడం లేదు.
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్-