
తెలంగాణ ఉద్యమ నినాదంలో కీలకమైంది, మొదటిదీ నీళ్లు. ప్రజలు తెలంగాణ సాధించి ఇచ్చి 11 ఏండ్లు గడిచినా తెలంగాణ పాలక పార్టీలు, తెలంగాణకు ప్రధానమైన జలవనరుల సమస్యను గాలికి వదిలి కాలం వెళ్లబుచ్చినాయని, సోయి లేకుండా ప్రవర్తించినాయని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఈ కాలంలో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తిరిగి చంద్రబాబు నాయుడు సీఎంగా మూడో ప్రభుత్వం నడుస్తోంది.
అక్కడ తొలి ప్రభుత్వం పట్టిసీమ చేపట్టి డెల్టాకు మూడో పంటకు నీటి గ్యారంటీ చేసి గోదావరి, కృష్ణా సంగమం సాధించినారని తన మురిపెం ప్రకటించింది. రెండో ప్రభుత్వం రాయలసీమ లిఫ్టు చేపట్టి పోతిరెడ్డిపాడు ద్వారా 90వేల క్యూసెక్కుల నీరు తరలించే వ్యవస్థల ఏర్పాటుకు తెరతీసింది. ఇప్పుడు మూడో ప్రభుత్వం గోదావరి నుంచి 200 టీఎంసీ నీటిని సాగర్ దిగువ నుంచి బొల్లాపల్లి మీదుగా తమకు వరంలాంటి బనకచర్ల మీదుగా సముద్రంలో కలిసిపోయే వరద జలాలను తరలించి ఆంధ్రాకంతా జలహారతి పడతామని, చేతనైతే తెలంగాణ ఏమైనా చేసుకోవచ్చునని పరమ అహంకారంతో ప్రకటించింది. ఇప్పుడు ఈ వివాదంలో తెలంగాణ ఒడ్డుకేసిన చేపలాగ తండ్లాడుతున్నది. ఇది ఎండిన డొక్కల ముచ్చట.
మ రి ఈ మూడు ప్రభుత్వాల కాలంలో తెలంగాణ ఏంజేసింది? గోదావరి మీద ప్రాణహిత– చేవెళ్లను రీడిజైన్ చేసి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రాకుండా చేసింది. పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని రీడిజైన్ చేసి మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం పరిధిలో 7, చేవేళ్ల పార్లమెంటు స్థానం పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు పరిధి వర్షాభావ ప్రాంత బీడు భూములకు నీళ్లు రాకుండా చేసింది.
లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వదిలేసింది. అంటే, అటు గోదావరి, ఇటు కృష్ణానీరు ఉపయోగంలోకి రాకుండా చేసింది. అంతమాత్రమే కాదు ఆంధ్రాకు వెళ్లి బేసిన్లు లేవు, భేషజాలు లేవు. ఏ భయం, సంకోచం లేకుండా ఎంత నీరైనా తరలించుకుపొమ్మని విశ్వాసం ఇచ్చి వచ్చింది.
మహబూబ్‌నగర్‌కు మరణశాసనంగా..
కృష్ణా బేసిన్లో ఎగువన తుంగభద్ర, కృష్ణా, భీమ నదులవెంట ఉండి కూడా శతాబ్దాలుగా నీటికి నోచుకోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను కోలుకోకుండా దెబ్బతీసింది. ఎన్నడూ మాటగా కూడా చర్చలో లేని పాలమూరు– డిండి అనే ప్రతిపాదనను పాలమూరు–రంగారెడ్డికి కుట్రపూరితంగా జోడించింది. మహబూబ్‌నగర్‌కు మరణశాసనంలాంటి డిండి నీటిని తరలించడానికి ఆధారంగా మార్చింది.
పాత పథకాలను పూర్తి చేయకుండా, తాను చేపట్టినవి కూడా పూర్తి కాకుండా అన్ని నిధులనూ కాళేశ్వరం, డిండి అనుబంధ రిజర్వాయర్ల మీద వెచ్చించి, పనిలో పనిగా అవినీతి వరదకు దారులేసుకుంది. ఇప్పుడు మూడో ప్రభుత్వం కాళేశ్వరం అవినీతిని చర్చకు వదిలి, పాలమూరు–రంగారెడ్డిని నత్తలకు వదిలి, అక్రమ డిండిని పరుగులు పెట్టిస్తున్నది. ఇంతలో బనకచర్ల వచ్చిపడింది.
బాబు మాయదారి మాటలు!
ఒకటి.. తెలంగాణ, ఆంధ్రా నాకు రెండు కండ్లు, రెండు.. వృథాగా సముద్రంలో కలిసిపోయే మిగులు నీరు తీసుకుంటే ఎవరికి ఏం నొప్పి. మూడు.. గోదావరి, కృష్ణా నదుల మీద మాది చివరి రాష్ట్రం మిగులు నీటిమీద హక్కు మాదే. మేం వాడేది వరద జలాలు కాదు. నికర జలాలు కాదు. కేవలం మిగులు జలాలు. నేను తెలంగాణకు ఎంతో చేశాను. తెలంగాణ నాకు సహకరించాలి.
తెలంగాణవాళ్లందరూ మా చేతిలోనే లీడర్లయ్యారు. వాళ్లెందుకు నన్ను అడ్డుకుంటారు. వాడుకునేది మిగులు జలాలైనప్పుడు, కరువు ప్రాంతాలైనప్పుడు కేంద్రం నిధులు ఇచ్చి తోడ్పడవలసిందే తప్ప ఆటంకాలు కల్పించకూడదు. ఇలా ఒక మాయదారి వర్ణన అల్లటంలో ఆయన తన నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు. విభజన చట్టంలో పొందుపరచని ఒక మంత్రుల–ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరపటం ఆయన ఎత్తుగడలలో భాగమే. నికర, వరద జలాలు తప్ప, మిగులు జలాలు ఉండవు!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో జలవనరుల కల్పనకు సంబంధించి చేసినదంతా కాలక్షేపమే. తెలంగాణకు నష్టమే. కర్నాటకవాళ్లు ఆల్మట్టి కట్టుకుంటుంటే వద్దని ఉద్యమాలు చేయించాడు. ఆంధ్రాకు నీరు తరలించే సుంకేశుల పనుల వేగం పెంచాడు. ఆర్డీఎస్ను వదిలేశాడు.
ఎగువ రాష్ట్రాలు హక్కు మేరకు నీరు తీసుకుంటే సహించని ఆయనకు మిగులు నీరు తీసుకునే హక్కు ఉంటుందా? వరద జలాలు పరీవాహక ప్రదేశమంతటా కురిసి నదిలోకి చేరి ప్రవహించేవి. అతివృష్టి, అనావృష్టి కాలాలు ఎదురైనా నదిలో లభ్యత ఉండే నీరు నికర జలాలు. ఈ నీటిపై ఆధారపడి పరీవాహక ప్రాంత రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ఆధారపడగల శాతం నిర్ణయించి నీరు పంచింది.
ప్రసుతం బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆధారపడే శాతాన్ని 75 శాతానికి పెంచి నీరు పంచింది. ఇంతలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినందువల్ల, తెలంగాణకు నీరు పంచవలసినందువల్ల ఆ ట్రిబ్యునల్ కొనసాగుతున్నది. వాదనలు వింటున్నది. నదిలో వరద జలాలు, నికర జలాలే ఉంటాయి.
కానీ, మిగులు జలాలు ఉండవు. తెలంగాణకు న్యాయంగా నీళ్లు దక్కలేదంటే ఆ దుర్మార్గం 58 ఏండ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులది. తొమ్మిదిన్నరేండ్లు కేసీఆర్‌ది. ఇప్పుడు రేవంత్‌రెడ్డిది. చంద్రబాబు ఈ నేరం నుంచి తప్పించుకోజాలడు.
దుష్టపథకాల సృష్టికర్తలు బాబు, జగన్!
అసలు గోదావరి నీటిమీద లెక్కలన్నీ ఉజ్జాయింపు లెక్కలే. కృష్ణా నీటిలెక్కలు చాలా ప్రయాసతో తీసినా పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలంలో తెలంగాణ పేరుతో నీరు పంచలేదు. వినియోగపు లెక్కల మీద ఆధారపడితే తెలంగాణలో నల్గొండలో తప్ప ఎగువన నీటి వినియోగమే లేదు. విభజన సందర్భంలో ఆంధ్ర పాలకులందరూ ఒక్కమాట మీద పోలవరం జాతీయ పథకంగా చట్టంలో చేర్పించుకున్నారు. అదే చట్టంలో తెలంగాణకు నీళ్లు పంచే అవకాశం లేకుండా పట్టుబట్టి మరీ క్లాజులు రాయించారు.
బ్రిజేశ్ ట్రిబ్యునల్కాలక్షేపపు ట్రిబ్యునల్‌గా ఇంతకాలం కొనసాగింది. ఈ క్లాజులవల్లనే చంద్రబాబు కానీ, జగన్ కానీ ఏ ఒక్కనాడు తెలంగాణకు నీళ్లు పంచాలని కోరలేదు. ఎవరి హయాంలో వాళ్లు నీళ్లు తరలించే దుష్ట పథకాలకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే బనకచర్లను ముందుకు తెచ్చారు. రెండు నదుల నీటిలో చాలా ఎక్కువ నీరు వాడుకుంటున్నందువల్ల ఏపీకి చుక్కనీరు తరలించుకునే హక్కులేదు. నీటిని తీసుకోకుండా మారటోరియం విధించాలి.
పాలమూరు ఎవరిని గెలిపించినా..
నిజంగానే తెలంగాణ ప్రభుత్వాలకి, పాలక పార్టీలకి, ప్రతిపక్ష పార్టీలకి కూడా తెలంగాణకు జలవనరుల కల్పనపట్ల, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తగిన కన్సర్న్ ఉండి ఉంటే 11ఏండ్ల కాలం తక్కువ కాదు. ఎంతో చేసి ఉండవచ్చు. కానీ, మోసం చేశారు. ఆంధ్రావైపు కృష్ణానది మీద వరద మొత్తం తరలించే వ్యవస్థలున్నాయి. తెలంగాణ వైపు ఏమున్నాయి? ఏమీ లేవని తెలుస్తున్నా, భౌగోళిక పరిస్థితుల వల్ల లిఫ్టులు తప్ప మరోదారి లేదని తెలిసినా ఏమీ చేయలేదు.
పైగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తరలించి ఇదే అభివృద్ధి అంటున్నారు. తెలంగాణలో కూడా 100శాతం నష్టపోయింది మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలోని 50లక్షల బీడు భూముల రైతాంగం. జిల్లా వాడే అని ఎంపీగా కేసీఆర్‌ను గెలిపించినా, జిల్లావాడే అని రేవంతరెడ్డిని గెలిపించినా ఈ జిల్లాలకు నీరు దక్కలేదు. కానీ, పొరుగు రాష్ట్రాలు నీటిని తరలించుకుపోతుంటే చూసే దృశ్యం మిగిలింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాలువాలు, బొకేలు మార్చుకుంటుంటే చూసే భాగ్యం మిగిలింది. మూడు ప్రభుత్వాల క్రీడలో తన హక్కులు కోల్పోతూ అవమానపడుతున్న పరిస్థితి మిగిలింది.
మూడు పనులు జరగాలి
దేశంలో ఎవడైనా బనకచర్ల అనేమాట ఎత్తాలంటే ముందుగా మూడు పనులు జరగాలి. మొదటది.. కృష్ణా, గోదావరి నదుల మీద రెండు రాష్ట్రాలలో చేపట్టిన నిర్మాణాలు, వాటికోసం జరిగిన వ్యయం, ఇంతకాలం ఉపయోగించిన నీరు. ఈ లెక్కలు తీయటం అసాధ్యంకాదు. తెలుగు ప్రజలకు అందివచ్చిన జ్ఞానం, చైతన్యం అంత తెలివిలేనివి కూడా కాదు.
రెండోది.. కృష్ణా, గోదావరి నీటిని పాత పంపకాలతో సంబంధం లేకుండా, ఉపయోగించుకుంటున్నవాడిదే హక్కు అనే ద్రోహపూరిత విధానంతో కాకుండా బేసిన్ ప్రయోజనాలు కాపాడేవిధంగా శాస్త్రీయ పద్ధతిలో పంచాలి. అందుకు పరీవాహక జనాభా, భూమి, వర్షపాతం, భూగర్భ జల లభ్యత, భూమి తేమ నిలుపుకునే శాతం, ఆప్రాంత వెనుకబాటుతనం వంటి అంతర్జాతీయ ఆమోదం ఉన్న విషయాలను ప్రాతిపదిక చేసుకోవాలి.
ప్రభుత్వాలు చేపట్టే ప్రతి చర్య, న్యాయస్థానాలు వెలువరించే ప్రతి తీర్పు ప్రజల మధ్య, ప్రాణాల మధ్య అసమానతలు, అన్యాయం తగ్గించాలనే రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా, న్యాయంగా జరగాలి.
జలఖడ్గం ఎదుర్కోవచ్చు. నిర్జల ఖడ్గం తరతరాల జీవితాలను బలి తీసుకుంటుంది. తెలంగాణని నిర్జల ఖడ్గం బారిన పడేశారు.
మూడోది.. గోదావరి మీద కాళేశ్వరం దెబ్బతినిపోయింది. కృష్ణానది మీద నీరు తీసుకునే నిర్మాణాలే లేవు. లిఫ్టులు ఖర్చువంటి వితండవాదనలు చేయకుండా రైతుల పొలాలకు కాలువల ద్వారా నీరివ్వటానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఎక్కడి రైతాంగానికి అక్కడి నీటి వనరుల నుంచి భూముల ముంపు, నిర్వాసిత సమస్య తగ్గేవిధంగా, వివక్షలేని న్యాయమైన నష్టపరిహారం చెల్లిస్తూ నీరు తీసుకునే వ్యవస్థలు, నిర్మాణాలు పరిమిత కాల వ్యవధిలో చేపట్టి పూర్తిచేయాలి. ఇది ఆదర్శంలాగ కనిపించవచ్చు. కానీ, రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇస్తున్న ఆదేశం. తరతరాలుగా నీటికి దూరమైన ప్రజల ఆక్రందన.
రెండు జిల్లాలకు చేస్తున్న ద్రోహం
మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల జలవనరుల కోసమే సాధించుకున్న పాలమూరు–రంగారెడ్డి లిఫ్టును జూరాల నుంచి దిగువకు మార్చి దానికి డిండి జోడించి పాలమూరు– రంగారెడ్డిని.. పాలమూరు–డిండిగా మార్చటం బనకచర్లకు మించిన దుర్మార్గం. హరీశ్‌రావు, కేసీఆర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నీటిపారుదల మంత్రులుగా ఈ రెండు జిల్లాలకు చేస్తున్న ద్రోహం ఇది. చేతులు పొడుగున్నాయని అవిటివాడి నోటి ముందరి ముద్ద గుంజుకుని తింటారా? ఇదీ గుర్తించాలి. సంకుచితంగా కాక తెలంగాణ పునర్నిర్మాణం గౌరవంగా జరగాలి.
బనకచర్ల ఆగాలంటే..
తెలంగాణ రాష్ట్ర భూములన్నీ సముద్ర మట్టానికి 50 నుంచి 600 మీటర్ల ఎత్తు ఉన్నాయి. ఇక్కడ కురిసిన నీరంతా పోయేది దిగువకే. దిగువ నీటిని దిగువ నుంచే తరలించుకుపోయే దుర్మార్గం బనకచర్ల. ఇది పొడుగుచేతుల వ్యవహారం. దానిలో న్యాయంలేదు. నీళ్ల సాధన విషయంలో న్యాయభావనకు, న్యాయసాధనకు దూరంగా ఉంటున్న తెలంగాణ మధ్య తరగతి క్రియాశీలం కాకుండా బనకచర్ల ఆగదు.
కేంద్రం తమ చేతిలోనిదే అన్న ధీమా చంద్రబాబును మిన్నకుండనీయదు. ఏ సంవత్సరపు నీళ్లు ఆ సంవత్సరం అయిపోతాయి. మీరు ఏడుస్తూ, దేబిరిస్తూ కూర్చుంటే అవతలివాడు తన్నుకుపోతాడు అని మందలించే దుస్థితి రావొద్దు అంటే తెలంగాణ సమాజం పార్టీల పూజలు వదిలి ప్రజలుగా మేల్కోవాలి. అప్పుడే ప్రభుత్వాలు, పార్టీలు దారికి వస్తాయి.
బనకచర్ల ఆగేదైనా, తెలంగాణలో నీటివాటా దక్కేదైనా, రైతు బతికేదైనా అక్కడే. లేకపోతే తెలంగాణకు నీళ్లుండవు. భూములుండవు. వ్యాపారాలుండవు. పోలేపల్లి సెజ్లాగ తమ నేలన తాము పరులకోసం గార్డు పని చేయాల్సిందే.
ఏమిటీ బనకచర్ల?
పోతిరెడ్డిపాడు ద్వారా తరలించే కృష్ణానదిని ఆంధ్రాలోని వీలైనన్ని ఎక్కువ రిజర్వాయర్లకు మలిపే ఒక వ్యవస్థ. దానిలో ఒక ఎస్కేప్ కాలువ కూడా ఉంది. మేం తెలుగు గంగ కాలువ వెంట ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి రైతు దానికి దొంగ కాలువ అని సరిగానే ప్రస్తావించాడు.
ఆ బనకచర్ల నుంచి ఆ కాలువ ద్వారా అవసరమైన అన్ని తావులకు కృష్ణా నీళ్లతోపాటు, గోదావరి నీళ్లు బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించి అటునుంచి తరలించే దుర్మార్గమే బనకచర్ల. ఈ దుర్మార్గాన్ని చలాయించటానికి చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తున్న భాష, ఎత్తుగడలు చాలా తీవ్రంగా వ్యతిరేకించవలసినవి.
మన నీరు మనం ఎందుకు తీసుకోం?
చంద్రబాబు నాయుడు ఎత్తుగడలు, లాబీయింగ్ సామర్థ్యాలు తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. ఆయన వల్ల ఎంత గాయపడ్డామో తెలంగాణ ప్రతిబిడ్డకు తెలుసు. మనం తెలంగాణలో నిలిచి బనకచర్ల గురించి మాట్లాడేటపుడు ఓ విషయం ఎరుకలో ఉండాలి.
ఇంతకాలం సరే మనం పరాయి పాలనలో ఉన్నాం. ఇపుడు మనకు చేతనైనది, అవసరమైనది, న్యాయమైనది ఏదో అది చేయకుండా అవతలివాడు చేసేది వద్దనే పోరాటంలో ఎంతకాలం వృథా చేసుకుంటాం? మన నీరు మనం ఎందుకు తీసుకోం? దీనికి ప్రజల భాగస్వామ్యం ఎందుకు పెంచం? ఇది గుర్తుండాలి.
వచ్చింది రాష్ట్రమే తప్ప, నీళ్లుకాదు!
ఆంధ్రకు నీటి అనుభవం ఈ నాటిది కాదు. 175 ఏండ్ల చరిత్ర అది. నీళ్ల కోసమే వాళ్లు రాయలసీమను కలుపుకొని తెలంగాణ మీద అధికారానికి వచ్చారు. మా శ్రీబాగ్ ఒప్పందం పోయిందని సీమవాళ్లు మొత్తుకుంటారు. కానీ, అసలు నష్టం తెలంగాణకు జరిగింది. నైజాం ప్రభుత్వం మద్రాసు, మైసూరులతో చేసుకున్న ఒప్పందాలు పోయాయి.
తుంగభద్ర నిర్మాణానికి నిలువెత్తు కృషిచేస్తే చుక్కనీరు రాకుండా పోయింది. ఏపీ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టులు, కాలువలు, లిఫ్టులు ఆంధ్రాకోసమే నిర్మించినందువల్ల తెలంగాణ సర్వస్వమూ కోల్పోయింది. కర్నాటక, మహారాష్ట్ర తమ నీటి హక్కు కోసం చేసిన ఫిర్యాదువల్ల వచ్చిన బచావత్ ట్రిబ్యునల్ ఉపయోగించుకుంటున్నవాళ్ల హక్కు ప్రాతిపదికన నీళ్లు పంచింది.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత తేలింది ఏమంటే తెలంగాణకు పంచిన నీళ్లు లేవు. నిర్మాణాలు లేవు. విభజన చట్టంలో నీళ్లు పంచే అవకాశాలూ లేవు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇంతకాలం చేతులు దులిపేసుకుని కూర్చున్న కారణమూ ఇదే. ఇప్పుడు 1956 నీటి పంపిణీ చట్టం సెక్షన్ 3 వల్ల వాదనలు వింటున్నా.. తీర్పు వచ్చేసరికి మరికొన్ని నిర్మాణాలు చేసుకుంటే ఉపయోగహక్కు ప్రాతిపదికన మిగులునీటి పేరుమీద నికర జలాల హక్కు కోసం చంద్రబాబు నాయుడు తన తెలివి ప్రదర్శిస్తున్నాడు.
ఆంధ్ర ముఖ్యమంత్రులందరూఈ పనే చేశారు. ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రులు, ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రులు తెలంగాణ పట్ల బాధ్యతలేని స్వప్రయోజనపరులు.వీళ్లకు తెలంగాణ రైతు కష్టం పట్ల, జలసాధన పట్ల కన్సర్న్ లేదు.
- ఎం. రాఘవాచారి, కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక-