మా దేశంలోకీ ఇండియన్స్ అక్రమంగా వచ్చారు: బంగ్లాదేశ్

మా దేశంలోకీ ఇండియన్స్ అక్రమంగా వచ్చారు: బంగ్లాదేశ్
  • భారత్‌లో మా వాళ్లు అక్రమంగా ఉంటే వెనక్కి పంపండి.. స్వీకరిస్తాం
  • మా దేశంలో ఉన్న విదేశీయుల్ని తిప్పి పంపేస్తాం: బంగ్లా విదేశాంగ మంత్రి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముస్లిమేతరులపై మత హింస జరుగుతోందన్న (పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చలో) కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మరోసారి ఖండించారు బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్. తమ పాలనలో అలాంటి వివక్ష లేదని, మిలటరీ ప్రభుత్వ కాలంలోనే మత హింస జరిగిందని చెప్పారు. అయితే తన భారత పర్యటన రద్దు చేసుకోవడానికి షా వ్యాఖ్యలకు సంబంధం లేదని తెలిపారు. తాను బిజీ షెడ్యూల్ వల్లే వాయిదా వేసుకున్నట్లు వివరించారు. భారత్‌తో తమది తియ్యటి బంధమని, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఎప్పటిలాగే ఉంటాయని అన్నారు బంగ్లా మంత్రి ఏకే అబ్దుల్.

భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌సీలపైనా ఆయన మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. భారతీయులూ తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చారని ఆరోపించారు. ఆర్థికంగా మంచి అవకాశాల కోసం భారతీయులు చాలా మంది అక్రమంగా సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లో ప్రవేశించారని చెప్పారు ఏకే అబ్దుల్. వాళ్లను వెనక్కి పంపేస్తామని చెప్పారాయన. అయితే, తమ దేశం నుంచి భారత్‌లో ప్రవేశించి, అక్రమంగా నివాసం ఉంటున్న వాళ్లను వెనక్కి పంపితే తాము స్వీకరిస్తామని చెప్పారు ఏకే అబ్దుల్. అలాంటి వాళ్ల లిస్టు ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. ఎన్నార్సీని భారత్ అంతర్గత వ్యవహారమని, ఎవరినీ వెనక్కి పంపే నిర్ణయం తీసుకోలేదని చెబుతోందని అన్నారాయన. అయితే తమ దేశంలో బంగ్లాదేశీయులు కాకుండా వేరే ఎవరైనా ప్రవేశించి ఉంటే వాళ్లను తాము తిప్పి పంపేస్తామని అన్నారు.