పీఎస్‌ఎల్‌వీ- సీ53 రాకెట్‌ ప్రయోగం సక్సెస్

పీఎస్‌ఎల్‌వీ- సీ53 రాకెట్‌ ప్రయోగం సక్సెస్

తిరుపతి జిల్లాలోని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) గురువారం (జూన్ 30న)  నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ 53 ప్రయోగం విజ‌య‌వంత‌మైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్‌ధావ‌న్‌ అంత‌రిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ గురువారం సాయంత్రం 6.02 గంట‌ల‌కు నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకెళ్లింది. కౌంట్‌డౌన్ ముగియ‌గానే ఇస్రో ఈ రాకెట్‌ను రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. పీఎస్ఎల్వీ- సీ53 సింగ‌పూర్‌, కొరియాకు చెంది మూడు ఉప‌గ్రహాల‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.

పీఎస్‌ఎల్వీ- సీ53 రాకెట్‌.. సింగపూర్‌కు చెందిన 365 కిలోల డీఎస్‌-ఈఓ ఉపగ్రహం, 155 కిలోల న్యూసార్‌, 2.8 కిలోల స్కూబ్‌-1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో వాణిజ్యప‌ర‌మైన రెండో మిష‌న్ ఇది. ప్రయోగం విజ‌య‌వంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో తేలిపోయారు. 

ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు.