నిరాశపర్చిన PSLV.. టెక్నికల్ సమస్యతో రాకెట్ ప్రయోగం విఫలం

నిరాశపర్చిన PSLV.. టెక్నికల్ సమస్యతో రాకెట్ ప్రయోగం విఫలం

శ్రీహరికోట: ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్‎కు వరుస విజయాలు కట్టబెడుతూ అత్యంత నమ్మకమైన రాకెట్‎గా, ఇస్రో కదనాశ్వంగా పేరు పొందిన పీఎస్ఎల్ వీ ఈసారి నిరాశపర్చింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదివారం ఏపీలోని శ్రీహరికోట నుంచి చేపట్టిన ‘పీఎస్ఎల్ వీ–సీ61 ఈవోఎస్–09’ మిషన్ విఫలమైంది.

 ఉదయం 5.59 గంటలకు నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లిన పీఎస్ఎల్ వీ-–సీ61 రాకెట్ తొలి రెండు దశల్లో విజయవంతంగా పనిచేసినా.. 12 నిమిషాల తర్వాత థర్డ్ స్టేజ్‎లోకి ఎంటర్ కాగానే టెక్నికల్ సమస్య తలెత్తడంతో ఈవోఎస్–09 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చలేకపోయింది. 

ఈ వైఫల్యానికి కారణాలను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. ‘‘పీఎస్ఎల్‎వీ రాకెట్‎లో నాలుగు స్టేజీలు ఉన్నాయి. సెకండ్ స్టేజ్ వరకూ రాకెట్ బాగానే పని చేసింది. కానీ థర్డ్ స్టేజ్‎కు చేరుకోగానే టెక్నికల్ సమస్య వచ్చింది. మోటార్ కేస్ చాంబర్‎లో ప్రెజర్ అకస్మాత్తుగా పడిపోవడంతో థర్డ్ స్టేజ్‎లో ఇంజన్ ఫెయిల్ అయింది. 

దీంతో రాకెట్ ఈ మిషన్‎ను పూర్తి చేయలేకపోయింది” అని ఆయన తెలిపారు. పీఎస్ఎల్ వీ–-సీ61రాకెట్ భూ పరిశీలక ఉపగ్రహం (ఈవోఎస్-09)ను కక్ష్యలోకి చేర్చాల్సి ఉండగా.. సుమారు 450 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి ఫెయిల్ అయిందన్నారు. కాగా, శాటిలైట్‎తో ఈ రాకెట్ సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఇస్రో రిటైర్డ్ సైంటిస్టు ఒకరు తెలిపారు.  

పీఎస్ఎల్ వీకి మూడో ఓటమి.. 

ఇస్రోకు ఇది ఓవరాల్‎గా 101వ రాకెట్ ప్రయోగం కాగా, పీఎస్ఎల్ వీ రాకెట్‎ను ప్రయోగించడం ఇది 63వ సారి. ఈ రాకెట్ మార్స్ మిషన్, చంద్రయాన్ వంటి కీలక విజయాలను ఇస్రోకు కట్టబెట్టింది. వరుస విజయాలతో నమ్మకమైన రాకెట్‎గా నిలిచింది. అయితే, తాజా ఫెయిల్యూర్‎తో కలిపి ఇప్పటివరకూ పీఎస్ఎల్​వీ రాకెట్ మూడుసార్లు మాత్రమే ఫెయిల్ అయింది.

1993లో చేపట్టిన తొలి మిషన్‎లో, ఆ తర్వాత 2017లో నావిగేషన్ శాటిలైట్ ప్రయోగంలో, ఇప్పుడు ఈవోఎస్–09 మిషన్‎లో మాత్రమే ఇది ఫెయిల్ అయింది. కాగా, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ హై రెసొల్యూషన్ ఫొటోలను తీయగలిగేలా ఈవోఎస్–09 ఉపగ్రహాన్ని రూపొందించారు.

స్పేస్ స్టేషన్‎కు హెల్ప్​చేస్తం.. అమెరికా కంపెనీ

ఇస్రో 2035 నాటికి సొంతంగా ‘భారత్ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటు చేసుకోనున్న నేపథ్యంలో సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికన్ కంపెనీ ‘వ్యాస్ట్’ వెల్లడించింది. వచ్చే ఏడాది ‘హావెన్–1’ పేరుతో సింగిల్ మాడ్యూల్ స్పేస్ స్టేషన్​ను తాము రెడీ చేస్తున్నామని, ఇండియన్ సైంటిస్టులు, ఇంజనీర్లకు స్టడీ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఇందుకోసం ఇస్రోతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని పేర్కొంది.