- అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన
- మోదీ చూడటానికి సాఫ్ట్.. కానీ టఫ్
- పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా చాలా గ్రేట్ పర్సన్
- 250% టారిఫ్లతో బెదిరించి, ఇండియా– పాక్ యుద్ధం ఆపానని కామెంట్
టోక్యో/సియోల్: ఇండియాతో త్వరలోనే ట్రేడ్ డీల్ కుదురుతుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉందన్నారు. మంగళవారం జపాన్ పర్యటన ముగించుకున్న ట్రంప్.. బుధవారం ఆసియా–పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్(అపెక్) సమిట్ కోసం సౌత్ కొరియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియాతో త్వరలోనే ట్రేడ్ డీల్ ఓకే కానుందని చెప్పారు. ‘‘ప్రధాని మోదీ చూడటానికి సాఫ్ట్‌గా కనిపిస్తారు.
కానీ ఆయన చాలా టఫ్” అని ట్రంప్ అన్నారు. మోదీతో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ‘‘పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గ్రేట్ పర్సన్. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ గ్రేట్ ఫైటర్. అందుకే ఆయన ఫీల్డ్ మార్షల్ గౌరవం పొందారు. వారి గురించి నాకు బాగా తెలుసు” అని మరోసారి పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. ఇండియా, పాక్‌పై 250% టారిఫ్ లు వేస్తానని బెదిరించి, యుద్ధం ఆపానన్నారు. మంగళవారం టోక్యోలోనూ ట్రంప్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. యుద్ధంలో 7 బ్రాండ్ న్యూ యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ ఆయన మరోసారి చెప్పుకొచ్చారు. కాగా, సౌత్ కొరియాలో అపెక్ సమిట్ వేదికగా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గురువారం భేటీ కానున్నారు. ఇరుదేశాల అధినేతల భేటీకి సంబంధించిన ఎజెండాపై రెండువైపులా అంగీకారం కుదిరిందని బుధవారం చైనా వెల్లడించింది.
