బీఆర్ఎస్ లీడర్​పై పీఎస్సార్ అనుచరుల దాడి

బీఆర్ఎస్ లీడర్​పై పీఎస్సార్ అనుచరుల దాడి

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరాములు సుజాత భర్త బీఆర్ఎస్ లీడర్ మల్లేశ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్​సాగర్ రావు అనుచరులు దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం పీఎస్సార్ అనుచరులు మల్లేశ్ కు ఫోన్ చేసి గతంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి బెదిరించారు. దీంతో ఫోన్​లోనే మాటామాటా పెరగడంతో కాంగ్రెస్ లీడర్లు కొంతం రమేశ్, సల్ల మహేశ్, రామగిరి బానేశ్, పూదరి తిరుపతి, కిషోర్ బాబుతో పాటు మరికొందరు మల్లేశ్ ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగారు.

బూతులు తిడుతూ మల్లేశ్​తోపాటు ఆయన భార్య , కౌన్సిలర్​ సుజాత, కొడుకు రాజు, కోడలు సోనియా, వదిన కళావతి చెల్లెలు పద్మ, దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులపైనా దాడి చేశారని మల్లేశ్ తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ రాజు పోలీస్ సిబ్బందితో వెళ్లి కాంగ్రెస్ లీడర్లను అక్కడి నుంచి పంపించారు. మల్లేశ్ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి ఎంక్వయిరీ చేస్తున్నారు. 

ఫ్లై ఓవర్​పై రాస్తారోకో...

మల్లేశ్​పై కాంగ్రెస్ లీడర్ల దాడిని నిరసిస్తూ బీఆర్​ఎస్ నేత నడిపెల్లి విజిత్ రావు ఆధ్వర్యంలో 
మంచిర్యాల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేశారు. పీఎస్ఆర్ గుండాయిజం నసించాలని, దాడికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.