కారులో తీసుకెళ్తూ.. తాడుతో ఉరేసి.. డబ్బులు అడిగేవాళ్లు ఉండొద్దనే ఆరుగురి హత్యలు

కారులో తీసుకెళ్తూ..  తాడుతో ఉరేసి.. డబ్బులు అడిగేవాళ్లు ఉండొద్దనే ఆరుగురి హత్యలు
  • అందరినీ గొంతు నులిమి చంపిన సైకో ప్రశాంత్
  • నిందితుడికి సహకరించిన తల్లి, మైనర్ తమ్ముడు
  • మరో ఇద్దరు ఫ్రెండ్స్ అరెస్ట్
  • కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ వెల్లడి

కామారెడ్డి, వెలుగు: నిజామాబాద్ జిల్లా మాక్లూర్​కు చెందిన ప్రశాంత్.. ఆస్తి కోసమే తన ఫ్రెండ్ కుటుంబాన్ని దారుణంగా హత్య చేసినట్లు కామారెడ్డి పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితులుగా ప్రశాంత్, అతని తల్లి, మైనర్ తమ్ముడు ఉన్నట్లు ప్రకటించారు. మొత్తం ఆరుగురిని వేర్వేరు చోట్ల హత్య చేసినట్లు తెలిపారు. కేసు వివరాలను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మంగళవారం మీడియాకు వివరించారు. 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో ఈ నెల 14న గుర్తు తెలియని యువతి డెడ్​బాడీ దొరికింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడే వరుస హత్యలు బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్​కు​ చెందిన పూనె ప్రసాద్, అదే ఊరికి చెందిన మేడిద ప్రశాంత్ ఫ్రెండ్స్. 2018లో ప్రసాద్ కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా అతనిపై కేసు నమోదైంది. అప్పుడు ప్రసాద్ గల్ఫ్​లో ఉన్నాడు. 

ఈ క్రమంలోనే ప్రశాంత్​కు ప్రసాద్ రూ.3.50 లక్షలు అప్పు ఇచ్చాడు. 2022, అక్టోబర్​లో ప్రసాద్ గల్ఫ్ నుంచి రాగానే అతన్ని మాక్లూర్ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటికొచ్చాక ప్రసాద్ కుటుంబాన్ని గ్రామస్తులు వెలివేయడంతో తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి కామారెడ్డి జిల్లా పాల్వంచకు వెళ్లిపోయాడు. డబ్బులు తిరిగివ్వాలని ప్రశాంత్​పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఇల్లు, పొలం తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే లోన్ ఇప్పిస్తానని ప్రసాద్​ను ప్రశాంత్ నమ్మించాడు. అయినా, ప్రశాంత్ డబ్బులివ్వలేదు. 

ప్రసాద్ ఒత్తిడి చేయడంతో అతని ఫ్యామిలీని చంపేయాలని ప్రశాంత్ ప్లాన్ చేశాడు. దుర్గానగర్ తండాకు చెందిన బానోతు వంశీ, గుగులోతు విష్ణుకు రూ.60 వేలు ఇచ్చి తనతో కలుపుకున్నాడు. నవంబర్ 29న మాక్లూర్ వెళ్లిన ప్రసాద్.. పైసలివ్వాలని ప్రశాంత్​పై ఒత్తిడి చేశాడు. వెంటనే వంశీ, విష్ణులను ప్రశాంత్ పిలిపించుకుని ప్రసాద్​ను మాక్లూర్ మండలం మదన్​పల్లి ఫారెస్ట్ ఏరియాకు తీసుకెళ్లారు. అక్కడ ప్రసాద్​కు మద్యం తాగించి చంపేసి పూడ్చిపెట్టారు.

ఒక్కొక్కరిని వరుస బెట్టి..  

ఈ నెల 1న ప్రశాంత్ పాల్వంచకు వెళ్లాడు. పాత కేసులో ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పాడు. అతను ఓ చోట ఉన్నాడని చెప్పి ప్రసాద్ భార్య శాన్విక అలియాస్ రమణి (29), చెల్లె శ్రావణి (23)ని నిజామాబాద్ తీసుకెళ్లాడు. శ్రావణిని నిజామాబాద్​లో ఉంచి భర్తను కలిపిస్తామంటూ రమణిని కారులో విష్ణు, వంశీ సాయంతో బాసర వైపు తీసుకెళ్లాడు. మధ్యలోనే తాడు బిగించి రమణిని హత్య చేసి డెడ్​బాడీని గోదావరి నదిలో పడేశారు. 

తర్వాత శ్రావణిని ప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే గొంతు నులిమి హత్య చేశారు. ఆమె డెడ్​బాడీని మెదక్ జిల్లా వడియారం శివారులో హైవే పక్కన పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితులు ముగ్గురు తిరిగి పాల్వంచ వెళ్లారు. ఇక్కడ ఉంటే పోలీసులు పట్టుకుపోతారని భయపెట్టి తల్లి సుశీల, ప్రసాద్ చెల్లెలు స్వప్న (26), అతని పిల్లలు చైత్రిక్, చైత్రిక (8)ను కారులో నిజామాబాద్ తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గరి లాడ్జిలో ఉంచారు.

ప్రశాంత్​కు సహకరించిన తల్లి, తమ్ముడు

ప్రశాంత్​కు సహకరిస్తున్న అతని తల్లి వడ్డెమ్మ లాడ్జీకి వచ్చింది. ప్రసాద్ తన పిల్లల్ని చూడాలంటున్నాడని సుశీల, స్వప్నలను అక్కడే ఉంచి మైనర్ అయిన తన తమ్ముడితో కలిసి పిల్లలను ప్రశాంత్ తీసుకెళ్లాడు. సుశీల, స్వప్నలకు కాపలాగా వడ్డెమ్మను ఉంచాడు. కవల పిల్లలను కారులోనే గొంతు నులిమి చంపేసి గోనె సంచిలో కట్టి సోన్ బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడేశారు. తిరిగి లాడ్జీకి వచ్చిన ప్రశాంత్.. అందరూ ప్రసాద్ దగ్గర ఉన్నారని, మనం తర్వాత వెళ్దామని సుశీలను నమ్మించాడు. ఈ నెల 13న స్వప్న (26)ను కూడా తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. భూంపల్లి శివారులో రోడ్డుపక్కన పెట్రోల్ పోసి డెడ్​బాడీని కాల్చేశారు. 

లాడ్జి నుంచి తప్పించుకున్న సుశీల

సుశీలను కూడా చంపేస్తే డబ్బుల గురించి అడిగేవాళ్లు ఎవరూ ఉండరని భావించిన ప్రశాంత్.. కొద్ది రోజులు ఆమెను లాడ్జిలోనే ఉంచాలనుకున్నాడు. కానీ.. ఆమె తప్పించుకుని బయటపడింది. సుశీల పాల్వంచకు వెళ్లి ఉండొచ్చని భావించి అక్కడికి వెళ్తుండగా.. గాంధారి ఎక్స్​రోడ్డు వద్ద ప్రశాంత్, విష్ణు, వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వారి నుంచి కారు, బైక్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రూ.30 వేల నగదు, 5 సెల్​ఫోన్లు, తాడు, రెండు పెట్రోల్ బాటిల్స్, ఒక బంగారు పుస్తె, గడ్డపార రికవరీ చేశారు. తర్వాత ప్రశాంత్ తల్లి వడ్డెమ్మ, ప్రశాంత్​ తమ్ముడిని అరెస్ట్ చేశారు. శ్రావణి, స్వప్న, కవల పిల్లల డెడ్​బాడీలు దొరికాయి. ప్రసాద్, శాన్విక డెడ్​బాడీలు దొరకాల్సి ఉందని ఎస్పీ వివరించారు. భూంపల్లి వద్ద స్వప్న డెడ్​బాడీ లీడ్​తో కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.