పోలీసులను చూసి పాక్‌ మాజీ మంత్రి పరుగో పరుగు..ఎందుకో తెలుసా..?

పోలీసులను చూసి పాక్‌ మాజీ మంత్రి పరుగో పరుగు..ఎందుకో తెలుసా..?

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ అరెస్టుతో ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలకు పాల్పడిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇస్లాబామాద్‌ హైకోర్టు వద్ద మంగళవారం (మే 16న) అనూహ్య ఘటన జరిగింది. పోలీసులు చూసిన ఓ మాజీ మంత్రి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు లోపలికి పరుగులు తీశాడు. 

పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ నేత ఇమ్రాన్‌ ఖాన్‌ను గతవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణంలో పాక్‌ రేంజర్లు బలవంతంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దీంతో పీటీఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ మాజీ మంత్రి, పీటీఐ పార్టీ సీనియర్‌ నేత ఫవాద్‌ చౌధరీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఫవాద్‌ను మంగళవారం (మే 16న) పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ క్రమంలోనే కోర్టు నుంచి బయటకు వచ్చిన ఫవాద్‌ చౌధరీని తన వాహనం ఎక్కి బయలుదేరుతుండగా.. పోలీసులు ఆయన కారును అడ్డగించారు. మరో కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఫవాద్‌.. తన కారు నుంచి వేగంగా దిగి కోర్టు లోపలికి పరుగులు పెట్టారు. బెయిల్‌ ఇచ్చినా తనను మళ్లీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన జడ్జీ.. మరో పిటిషన్‌ దాఖలు చేయాలని ఆయనకు సూచించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను పీటీఐ పార్టీ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆ వీడియోలో ఫవాద్‌ పరిగెత్తి కిందపడిపోగా.. లాయర్లు ఆయనకు సాయం చేసి కోర్టు లోపలికి తీసుకెళ్లారు. ఫవాద్‌ కు బెయిల్ మంజూరు చేసినా.. పోలీసులు ఆయనను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారని పీటీఐ ఆరోపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇమ్రాన్‌ఖాన్‌ హయాంలో ఫవాద్‌ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వ్యవహరించారు.

https://twitter.com/TheSaadKaiser/status/1658427627139416067