16 వేల 395 ప్రాంతాల్లో ప్రజా పాలన సదస్సులు : సీఎస్ శాంతి కుమారి

16 వేల 395 ప్రాంతాల్లో  ప్రజా పాలన సదస్సులు : సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇందులో 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులలు ఉన్నాయని వెల్లడించారు. ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు మొత్తం 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తు ఫారాలు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   

గ్రామ సభలు ఉదయం 8 గంటలకే ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి 100 మంది దరఖాస్తు దారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా షామియానా, బారికేడ్లు, తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.