ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రజల నమ్మకమే ముఖ్యం

ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రజల నమ్మకమే ముఖ్యం

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా సైన్సెస్ టెక్నాలజీ వాడకానికి ప్రజల నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు సవాల్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని, దాని వల్ల కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. మంగళవారం దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ‘‘ఏఐ ఆన్ ది స్ట్రీట్, మేనేజింగ్ ట్రస్ట్​ఇన్ ది పబ్లిక్ స్క్వేర్” అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు. డేటా భద్రత, వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు అనుమతి లేకుండా ఏఐ టెక్నాలజీని నిఘా కార్యకలాపాలకు వాడబోమని ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన అన్నారు. ఈ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ అధికారాలను స్పష్టంగా నిర్దేశించినపుడే అది సాధ్యమవుతుందన్నారు. నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కీలకమన్నారు.  

కేటీఆర్ తో నోవార్టిస్ సీఈవో భేటీ.. 
రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆశీర్వాద్ పైప్స్ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో దావోస్ లో అలియాక్సిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కేటీఆర్ తో  కంపెనీ సీఈవో కోయిన్ స్టికర్ భేటీ అయ్యారు. ఈ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ చెప్పారు. కాగా, మంత్రి కేటీఆర్ తో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్ సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తమ కార్యాలయం రెండో అతిపెద్దదిగా మారిందని నరసింహన్ చెప్పారు. మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీల్లోకెల్లా నోవార్టిస్ సెంటర్ అతి పెద్దదన్నారు. హైదరాబాద్ లో అన్ని విధాల సౌలతులు ఉండడంతోనే ఇది సాధ్యమైందన్నారు. 

సద్గురు, ఆదిత్య థాక్రేలతో సమావేశం.. 
దావోస్​లో సద్గురు జగ్గీ వాసుదేవ్​తో కేటీఆర్ సమావేశమయ్యారు. సేవ్ సాయిల్ పేరుతో సద్గురు చేస్తున్న కార్యక్రమంపై చర్చించారు. రానున్న రెండు, మూడు దశాబ్దాల్లో ప్రపంచంలోని వ్యవసాయ నేలలు అంతరించిపోయే ప్రమాదముందని.. పంటలకు అనుగుణంగా ఇప్పట్నుంచే భూమిని సారవంతం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సద్గురు అభిప్రాయపడ్డారు. కాగా, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే దావోస్ లో కేటీఆర్ ను కలిశారు. ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు గల అవకాశాలపై చర్చించారు.