ఎమ్మెల్యే సారూ​..రాజీనామా చెయ్​

ఎమ్మెల్యే సారూ​..రాజీనామా చెయ్​
  • ఎమ్మెల్యే సారూ​..రాజీనామా చెయ్​
  • టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలకు హుజూరాబాద్ సెగ
  • దళితబంధు కోసం జనం నుంచి పెరుగుతున్న ఒత్తిడి
  • బెడిసికొడ్తున్న కేసీఆర్ ఎన్నికల వ్యూహం
  • ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే స్కీములు, అభివృద్ధికి నిధులు వస్తాయని క్యాంపెయిన్​
  • సోషల్ మీడియాలో వైరల్​గా మారుతున్న పోస్టులు
  • రాష్ట్రమంతా ఇయ్యాలంటే రూ.2 లక్షల కోట్లు అవసరం

నెట్​వర్క్, వెలుగు: ఎన్నికలు ఎక్కడుంటే అక్కడే స్కీముల అమలు, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్ వ్యూహం బెడిసికొడుతోంది. టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలకు హుజూరాబాద్ సెగ తగులుతోంది. హుజూరాబాద్​లో ప్రారంభించబోయే దళిత బంధు స్కీమ్ తమ నియోజకవర్గాల్లోనూ అమలు కావాలంటే టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని జనం సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.‘ఎమ్మెల్యే గారూ మీరు రాజీనామా చేయండి.. దళితబంధు సహా అన్ని పథకాలు, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు ఇస్తారు.. ఆ తర్వాత మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి గెలిపించుకుంటాం..’ అంటూ పోస్టులు పెడుతున్నారు. పబ్లిక్​, సోషల్​ యాక్టివిస్టులు ఫేస్​బుక్, వాట్సాప్, ట్విట్టర్ వేదికగా క్యాంపెయిన్ నడుపుతున్నారు. వైరల్ అయితున్న ఈ పోస్టులకు ప్రజలు లైకులు, షేర్లతో మద్దతు తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తమకూ పథకాలు, ఫండ్స్ వస్తాయని కామెంట్లు పెడ్తున్నారు.

హుజూరాబాద్​కు వేల కోట్ల రూపాయలు
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేయడంతో హుజూరాబాద్​లో జరగనున్న ఉప ఎన్నికలో గెలవడం టీఆర్​ఎస్​కు, వ్యక్తిగతంగా కేసీఆర్​కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఎట్లైనా గెలిచి తీరాలని అనుకుంటున్న సీఎం కేసీఆర్, నియోజకవర్గంలో 48 వేల దాకా ఉన్న దళితుల ఓట్లపై కన్నేశారు. వాటిని గంపగుత్తగా రాబట్టాలనే వ్యూహంతో ‘దళిత బంధు’ స్కీంను హుజూరాబాద్​నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో సుమారు 20 వేల దళిత కుటుంబాలు ఉండగా, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అకౌంట్లలో వేస్తామని, ఇష్టమొచ్చిన వ్యాపారం చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి దళితబంధు స్కీం ప్రకటించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన వంద కుటుంబాలకు పైలట్​ప్రాజెక్టుగా అమలుచేస్తామన్న సీఎం, ఉప ఎన్నికల నేపథ్యంలో మాటమార్చారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 20 వేల కుటుంబాలకు ఏకంగా రూ.2వేల కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

బైఎలక్షన్ వస్తేనే పథకాలు, ఫండ్స్
రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ వరాలు ప్రకటించడం సీఎం కేసీఆర్​కు అలవాటుగా మారింది. కిందటేడాది దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా 57 ఏండ్లు దాటిన అందరికీ పింఛను ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఆ నియోజకవర్గంలో నాలుగు వేల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి ఆపేశారు. ఊరూరా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి రూ.20 కోట్ల వరకు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఫండ్స్ రిలీజ్​చేయలేదు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్​లో వరదలు ముంచెత్తడంతో ఇంటికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా 134 పంచాయతీలు, ఆరు మండల కేంద్రాలు, రెండు మున్సిపాలిటీలకు కలిపి రూ.70 కోట్లు ప్రకటించారు. అక్కడి లంబాడా గిరిజనులను దృష్టిలో పెట్టుకొని పోడుభూములకు పట్టాలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సాగర్​ ఎన్నికలకు ముందు నెల్లికల్లు సహా వివిధ లిఫ్టు స్కీంలకు రూ.2500 కోట్లు ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని 844 జీపీలకు రూ.20 లక్షల చొప్పున, 31 మండల కేంద్రాలకు రూ.30 లక్షల చొప్పున, నల్గొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడకు రూ.5 కోట్లు, మిగిలిన ఆరు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున సుమారు రూ.200 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామని కూడా చెప్పారు. తాజాగా హుజూరాబాద్ ఎన్నికల కోసం దళితబంధు పేరిట ఒక్క నియోజకవర్గంలోనే 2 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు అన్ని వర్గాలకు స్కీంలు, డెవలప్​మెంట్​వర్క్స్​కు రూ.కోట్ల కొద్ది నిధులు కేటాయిస్తున్నారు. తమ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తే తప్ప తమకు స్కీంలు రావని, అభివృద్ధి జరగదని భావిస్తున్న పబ్లిక్​ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. 

కిందమీదైతున్న ఎమ్మెల్యేలు  
‘ఎన్నికలు ఉన్నందునే హుజూరాబాద్​లో దళితబంధు అమలు చేస్తున్నాం.. ఇందులో తప్పేముంది? ’ అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ ప్రారంభమైన ఈ ఉద్యమం ఒకట్రెండు రోజుల్లోనే రాష్ట్రమంతా పాకింది. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులకు సెగ తాకుతోంది. ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి ఉంది. రాజీనామా చేసి దళిత బంధు అమలయ్యేలా చూడాలని జనం డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికిప్పుడు స్టేట్​వైడ్ దళిత బంధు అమలుచేయాలంటే సుమారు రూ.2లక్షల కోట్లకు పైగా అవసరం. రాష్ట్రం అప్పులకుప్పగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం. అందుకే దీనిపై స్పందించలేక దళిత ఎమ్మెల్యేలు కిందమీదైతున్నారు. 

ఎన్నికల స్టంట్​
దళిత బంధు స్కీం పక్కా ఎన్నికల స్టంట్. పైలట్​ప్రాజెక్టుగా ఎస్సీ నియోజకవర్గాన్ని కాకుండా హుజూరాబాద్​ను ఎంపికచేయడమే ఇందుకు నిదర్శనం. బై ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే అక్కడి లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున అందించాలి. రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాల కోసం దళితుల భూములే లాక్కుంటున్నారు. కోకాపేటలో అమ్మిన భూముల్లోనూ దళితులవే ఎక్కువ ఉన్నాయి. బాధిత రైతులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్​లో అప్పీల్ చేసినా పట్టించుకోకుండా భూములు విక్రయించారు. 
- సడిమెల యాదగిరి, ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

అంతటా అమలు చేయాలి
అన్ని నియోజకవర్గాల్లో  దళిత బంధు పథకాన్ని  అమలు చేయాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అక్కడి 20 వేల దళిత కుటుంబాల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమచేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​కింద కేటాయించి, ఇప్పటివరకు ఖర్చు చేయని రూ.30 వేల కోట్లను దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగించాలి. దళిత కుటుంబా లకు మూడెకరాల చొప్పున పంపిణీ చేయాలి. 
- పి.శంకర్‌‌‌‌‌‌‌‌, దళిత బహుజన ఫ్రంట్‌‌‌‌‌‌‌‌, జాతీయ కార్యదర్శి, సిద్దిపేట

మిగిలిన చోట్ల దళితులు లేరా
గతంలో ప్రవేశపెట్టిన ‘దళితులకు మూడు ఎకరాల భూమి’ పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయింది. దళిత బంధు కూడా అంతే. హుజూరాబాద్ ఎన్నికలు ముగియగానే పక్కనపెట్టేస్తరు. దళితులు ఒక్క హుజూరాబాద్ లోనే ఉన్నారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నొళ్లు కనిపిస్తలేరా? కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారు. దళిత బంధు తర్వాత ఎస్టీ బంధు, బీసీ బంధు, కాపు బంధు, కమ్మ బంధు పేరుతో డిమాండ్స్ వస్తాయి. ఈ లోపు హుజూరాబాద్ ఎన్నికలు అయిపోతాయి. తరువాత అన్ని బంధులు బంద్​అయితయ్.
- సప్పిడి ప్రభాకర్, మాల మహానాడు మండల కన్వీనర్, ఖమ్మం రూరల్

మా మంత్రి రాజీనామా చేస్తే మాకో కొత్త పథకం వస్తది
నాగార్జున సాగర్​లో ఉపఎన్నికలు వచ్చినప్పుడు గొర్రెలు ఇస్తమని అన్నరు. ఇప్పుడు హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి దళిత బంధు అంటున్నరు. మా జిల్లా మంత్రి రాజీనామా చేస్తే మాక్కూడా ఉపఎన్నిక వచ్చి  ఓ కొత్త పథకం వచ్చే అవకాశముంది. కేసీఆర్​కు ఎలక్షన్లు వచ్చినప్పుడే దళితులు గుర్తుకు వస్తున్నరు. ఆయనను దళితులు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో దళితులు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారు.
‑ పొన్నాల నర్సింహులు, దళిత సామాజిక వేత్త, సిరిసిల్ల జిల్లా

రాజీనామా చేస్త.. నా నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లివ్వండి
మునుగోడుకు రూ.2 వేల కోట్లు ఇస్తానంటే నా పదవి త్యాగం చేసేందుకు రెడీ. ఒక్క హుజూరాబాద్​కే 
రూ.2 వేల కోట్లు ఇస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితేంటి? ఎక్కడ ఉప ఎన్నికొస్తే అక్కడే ఫండ్స్ ఇస్తున్నరు. ఈటల​ను ఓడగొట్టేందుకు దళితబంధు పెట్టి హుజూరాబాద్ దళితులను అభివృద్ధి చేస్తరట. నేను కేసీఆర్ చుట్టం కాదు. పార్టీ కాదు. కాబట్టి రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొస్తే రూ.2 వేల కోట్లు ఇస్తడుకావచ్చు. 
‑ కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే