వేసవిలో కండరాల నొప్పులు వేధిస్తున్నాయా ? నిద్ర పట్టడం లేదా ? ఇలా చెక్ పెట్టండి !

వేసవిలో కండరాల నొప్పులు వేధిస్తున్నాయా ? నిద్ర పట్టడం లేదా ?  ఇలా చెక్ పెట్టండి !

ఎండకాలంలో తీవ్రమైన ఎండలు, చెమటలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అయితే వీటితో పాటు రాత్రిపూట నిద్ర లేకుండా చేసి, పగటి ప్రశాంతతను పాడుచేసే మరో సమస్య కూడా ఉంది. అదే కండరాల నొప్పులు లేదా తిమ్మిర్లు అంటే కండరాలు అకస్మాత్తుగా పట్టేసి, గట్టిగా బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పి రావడం.

ఈ నొప్పి ముఖ్యంగా చేతులు, కాళ్లు, తొడలు, పిక్కల భాగంలో వస్తుంది. ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు లేదా రాత్రి పడుకున్నప్పుడు ఈ నొప్పి అకస్మాత్తుగా రావచ్చు. అసలు వేసవిలో ఈ సమస్య ఎందుకు ఎక్కువవుతుంది? దీని నుంచి ఎలా బయటపడాలో వైద్య నిపుణుల ద్వారా  తెలుసుకుందాం.....

ఎండకాలంలోనే ఈ సమస్య ఎందుకు 
వైద్యుల ప్రకారం... శరీరంలో నీరు, ముఖ్యమైన ఖనిజ లవణాలు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎండ తీవ్రతకు శరీరాన్ని చల్లబరచడం కోసం మనకు విపరీతంగా చెమట పడుతుంది. చెమట రూపంలో కేవలం నీరు మాత్రమే కాదు... మన కండరాలు, నరాలు సరిగ్గా పనిచేయడానికి అవసరమయ్యే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు కూడా శరీరం నుండి బయటకు పోతాయి. వీటి బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు, కండరాలు అకస్మాత్తుగా ముడుచుకుపోయి తీవ్రమైన నొప్పులు వస్తాయి.

ఈ ప్రమాదం  ఎవరికి 
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల శరీరం త్వరగా  డీహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి  ఎండలో పనులు చేసే కూలీలు, కార్మికులు ఇంకా అథ్లెట్లు, జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేసేవారు, వయసు పైబడిన వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులు, రోజంతా తగినంత నీరు తాగని వారికి ఈ తిమ్మిర్ల ముప్పు ఎక్కువ ఉంటుంది. 

చాలామంది దీనిని చిన్న నొప్పే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ ప్రతిసారి ఇలా కండరాలు పట్టేయడం అనేది శరీరంలో నీరు, ఖనిజాలు తీవ్రంగా తగ్గిపోయాయని చెప్పడానికి ఒక హెచ్చరిక లాంటిది.  

కండరాల నొప్పుల లక్షణాలు 
ఇవి ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా ఒక్కసారిగా వస్తాయి. కండరాలు అకస్మాత్తుగా బిగుసుకుపోయి విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే, అసలు అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమవుతుంది.రాత్రిపూట కాళ్లు పట్టేయడం వల్ల నిద్ర చెడిపోతుంది. ఆ నొప్పి తరువాత  రోజు వరకు బాధిస్తూనే ఉంటుంది.

కేవలం నీళ్లు తాగితే సరిపోదు
విపరీతంగా చెమటలు పడుతున్నప్పుడు కేవలం సాదా నీళ్లు తాగితే సరిపోదని, శరీరానికి తిరిగి ఎలక్ట్రోలైట్లు అందించడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. దీని కోసం మీరు రోజు ఈ చిన్న మార్పులు చేసుకోండి:

*ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా తీసుకోవడం కోసం మీ ప్రతిరోజు ఆహారంలో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోండి.

*పౌష్టికాహారం కోసం  పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, పుచ్చకాయ, పెరుగు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్‌ వంటివి తింటే శరీరానికి అవసరమైన ఖనిజాలు త్వరగా అందుతాయి.

*రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి. మరీ ఎక్కువ సేపు ఎండలో నిలబడకూడదు. వ్యాయామం లేదా బరువైన పనులు చేసే ముందూ, చేసిన తర్వాత ఖచ్చితంగా బాగా నీళ్లు తాగాలి.

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి 
మంచి ఆహారం, తగినంత నీరు తీసుకుంటే ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అయితే... మీకు ప్రతిసారి కండరాలు పట్టేస్తూ ఉన్న, నొప్పి చాలా గంటల పాటు తగ్గకుండా ఉన్న... నొప్పితో పాటు మీకు వాపు లేదా బలహీనత కనిపిస్తే, ఎలాంటి కారణం లేకుండానే ఈ సమస్య పదే పదే వేధిస్తుంటే... అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇది లోపల మరేదైనా పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నట్లు చెప్పే లక్షణం కావచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు, సరైన ఆహారంతో ఈ నొప్పుల నుండి ఈజీగా రిలీఫ్  పొందవచ్చు.