రెండో డోస్ వేయించుకోవట్లే!

రెండో డోస్ వేయించుకోవట్లే!
  • కరోనా టీకాకు 13.58 లక్షల మంది దూరం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కంట్రోలవడంతో వ్యాక్సిన్‌‌పై జనాల్లో ఆసక్తి తగ్గుతున్నది. గతంలో వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర గంటలకొద్దీ లైన్లలో నిలబడి మరీ వేయించుకున్న వాళ్లు, ఇప్పుడు ఇంటికొచ్చి వేస్తున్నా వేయించుకోవడం లేదు. జూన్ చివరి నాటికి తొలి డోసు తీసుకున్న 13.58 లక్షల మంది సెకండ్ డోసుకు రాలేదు. వీళ్లందరి సెకండ్ డోసు గడువు ముగిసిందని హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. వీరిలో మెజారిటీ కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లే. జూన్ 25 నాటికి రాష్ర్టంలో 86.06 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అక్టోబర్ చివరి నాటికే వీళ్లంతా సెకండ్ డోసు తీసుకోవాలి. కానీ ఇప్పటికీ 72.48 లక్షల మందే తీసుకున్నారు. రెండు డోసులు తీసుకుంటేనే యాంటీబాడీ ప్రొటెక్షన్ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కొవ్యాగ్జిన్‌‌ అయితే 4 నుంచి 6 వారాల మధ్య, కొవిషీల్డ్‌‌ 12 నుంచి 14 వారాల మధ్య సెకండ్ డోసు తీసుకోవాలంటున్నారు. రాష్ర్టంలో 88 లక్షల మంది సింగిల్ డోసు కూడా వేయించుకోలేదు. 2.8 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా 1.2 కోట్ల మందికి సింగిల్ డోసు, 72.48 లక్షల మందికే రెండు డోసులు పూర్తయ్యాయి.
162 కేసులు.. ఒకరు మృతి
రాష్ట్రంలో మరో 162 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ఆదివారం 32,828 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్‌‌లో 63 మందికి, జిల్లాల్లో 99 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,66,546కి చేరిందని చెప్పింది. ఇప్పటివరకు 6,58,170 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో మరో 4,455 యాక్టివ్‌‌ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీరిలో రెండు వేల మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వాళ్లు హోమ్ ఐసోలేషన్‌‌లో ఉన్నారన్నారు. కరోనాతో ఆదివారం ఒకరు చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 3,921కి పెరిగిందని బులెటిన్‌‌లో పేర్కొన్నారు.