34 సీట్లపై కేసీఆర్ ​స్పెషల్​ ఫోకస్.. టికెట్లు ప్రకటించిన తర్వాత ఫ్లాష్​ సర్వే

34 సీట్లపై కేసీఆర్ ​స్పెషల్​ ఫోకస్.. టికెట్లు ప్రకటించిన తర్వాత ఫ్లాష్​ సర్వే
  • ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో 34 మందిపై తీవ్ర వ్యతిరేకత
  • వచ్చే వారంలో ఎమ్మెల్యే అభ్యర్థులతో మీటింగ్​
  • వ్యతిరేకతను అధిగమించే అంశాలపై సలహాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 34 అసెంబ్లీ సెగ్మెంట్లపై బీఆర్ఎస్​చీఫ్, సీఎం కేసీఆర్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. టికెట్లు ప్రకటించిన స్థానాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థులపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు పలు టీంలను రంగంలోకి దించి ఫ్లాష్​సర్వేలు చేయించారు. ఈ సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్​ రిపోర్టుల్లోనూ 34 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ ప్రభావం పార్టీపైనా పడుతుందని తేలింది. దీంతో ఆయా స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని కేసీఆర్​ చూస్తున్నారు. సిట్టింగ్​ఎమ్మెల్యేలు, క్యాండిడేట్లపై వ్యతిరేకత పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీయకుండా  జాగ్రత్త చర్యలకు దిగుతున్నారు. వచ్చే వారం తెలంగాణ భవన్​లో ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఇతర ప్రజాప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

 ఈలోపే లీడర్ల మధ్య వర్గ విభేదాలకు చెక్​పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఈ టాస్క్ లో ఉండగా.. అమెరికా నుంచి ల్యాండ్​ అయిన వెంటనే కేటీఆర్​ కూడా అసంతృప్తులతో చర్చలు జరుపనున్నారు. మొదట పార్టీలో భిన్నస్వరాలకు చెక్​పెట్టి అందరినీ ఒక్క తాటిపైకి తేవాలని, ఆ తర్వాతే ప్రజల్లోకి వెళ్లి పాజిటివ్​ ఓటు సాధించాలనే ప్రయత్నాల్లో బీఆర్​ఎస్​ చీఫ్​ ఉన్నారు.

ఏయే జిల్లాల్లోనంటే..!

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కేసీఆర్​ఈ నెల 21న ప్రకటించారు. ఆ తర్వాత సర్వేలు చేయించారు. ఈ సర్వే నివేదికల్లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో మూడు, ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో రెండు, ఉమ్మడి కరీంనగర్​లో ఏకంగా ఐదు, ఉమ్మడి మెదక్​జిల్లాలో రెండు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు, హైదరాబాద్​జిల్లాలో మూడు, ఉమ్మడి మహబూబ్​నగర్​లో నాలుగు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదు, ఉమ్మడి వరంగల్​లో మూడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు స్థానాల్లో అభ్యర్థులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా ప్రగతి భవన్​కు రిపోర్టులు అందినట్టు తెలుస్తున్నది. 

ఇందులో 20కి పైగా నియోజకవర్గాల్లో టికెట్​ఇచ్చిన అభ్యర్థులను మార్చాల్సిందేనని సొంత పార్టీ లీడర్లే డిమాండ్​ చేస్తున్నారు. మరికొందరు.. టికెట్​ఇచ్చిన క్యాండిడేట్లు గెలువరని, తమకు అవకాశం ఇప్పించాలని తెరవెనుక లాబీయింగ్​ చేసుకుంటున్నారు. ఇలాంటి సీట్లను లెక్కలోకి తీసుకుంటే నంబర్​45 వరకు చేరనుంది. ఇటు పార్టీలో అసంతృప్తి, అటు ప్రజల్లో వ్యతిరేకత ఇలాగే ఉంటే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవనే అంచనాకు గులాబీ బాస్​ వచ్చినట్టు తెలుస్తున్నది.

ఎన్నికల షెడ్యూల్​ వచ్చేవరకు మరిన్ని సర్వేలు

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​వచ్చే వరకు మరికొన్ని సర్వేలు చేయించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే ఫ్లాష్​సర్వే రిపోర్టులపై బీఆర్​ఎస్​లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న అభ్యర్థుల్లో తాము ఉన్నామా అని ప్రగతిభవన్​తో సన్నిహిత సంబంధాలున్న నేతలను ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేల పేర్లు ప్రకటించే సమయంలోనే సర్వేల ఆధారంగా పని తీరు బేరీజు వేస్తామని, పని తీరు మార్చుకోని వారిని మార్చేస్తామని కేసీఆర్​ తేల్చి చెప్పారు. 

అన్నట్టుగానే అభ్యర్థులను ప్రకటించిన వెంటనే సర్వే బృందాలను రంగంలోకి దించారు. వేర్వేరు టీమ్​లు ఇచ్చిన రిపోర్టులను క్రోడీకరించి అన్ని సర్వేల్లోనూ ఎక్కువ వ్యతిరేకత ఉన్న క్యాండిడేట్లతో ప్రగతి భవన్​పెద్దలు మాట్లాడుతున్నట్టు తెలిసింది. సర్వే నివేదికలో ఏముందో చెప్పకున్నా నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచిస్తున్నట్టు తెలిసింది. అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత కూడా కొందరు హైదరాబాద్​లోనే తిరుగుతుండటంపైనా కేసీఆర్​ కోపంతో ఉన్నట్లు సమాచారం. 

సార్​ మేమైతేనే గెలుస్తం

ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వాళ్లలో కొందరిని మార్చాలనే డిమాండ్​జోరందుకుంది. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి గెలిచే ప్రసక్తే లేదని, తమకు చాన్స్​ఇస్తే గెలిచి వస్తామని పలువురు నేతలు చెప్పుకుంటున్నారు. ప్రగతి భవన్​ పెద్దలను నేరుగా కలిసి ఎమ్మెల్యే క్యాండిడేట్​ను మార్చి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంచిర్యాలలో అర్వింద్​రెడ్డి, జహీరాబాద్​లో ఢిల్లీ వసంత్, ఉప్పల్​లో బొంతు రామ్మోహన్, పాలేరులో తుమ్మల నాగేశ్వర్​రావు తదితరులు కేసీఆర్​ కుటుంబ సభ్యుల ద్వారా లాబీయింగ్​చేస్తున్నట్టు తెలుస్తున్నది. 

ఇంకో పది మంది వరకు ఆశావహులు ఇతర మార్గాల ద్వారా సిట్టింగులను మార్చి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. మంత్రి కేటీఆర్ హైదరాబాద్​కు తిరిగి వచ్చిన తర్వాత ఇంకొంత మంది నేతలు ఆయనను కలిసి అభ్యర్థులను మార్చి తమకు టికెట్లు ఇవ్వాలని కోరేందుకు రెడీ అవుతున్నారు. ఈ సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాగానే ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్​సమావేశం కానున్నారు. ఏ అసెంబ్లీ సెగ్మెంట్​లో  ఏ ఫార్ములా అనుసరించాలి, వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే దానిపై ఆయన దిశానిర్దేశం చేస్తారని బీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి.