
- 23 వరకు ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు
- హాజరు కానున్న మంత్రులు
- నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రైతుభరోసా స్కీం గైడ్లైన్స్రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో వేసిన కేబినెట్సబ్కమిటీ ఈ నెల 10 నుంచి 23వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఉమ్మడి జిల్లాలవారీగా రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు సహా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించబోతోంది. ఈ నెల 10న ఖమ్మం జిల్లాలో, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ సమావేశాలకు ఆయా వర్గాలను సమీకరించాల్సిన బాధ్యతను కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించింది. కేబినెట్సబ్కమిటీ ఇప్పటికే ఒక దఫా సమావేశమైంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల అధికారులతో కలిసి విధివిధానాలపై చర్చించారు. సాగులోలేని భూములకు ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుభరోసా ఇవ్వొద్దని ఓ నిర్ణయానికి వచ్చారు.
అలాగే, ఒక రైతుకు ఐదు ఎకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలా? పది ఎకరాల వరకు ఇవ్వాలా? అనే అంశంపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోయారు. రైతుబంధు పొందుతున్నవారిలో 83 శాతం మంది 5 ఎకరాల్లోపు రైతులేనని, దీంతో 5 ఎకరాలకు కటాఫ్ పెడ్తే మెజారిటీ రైతులు కవర్అవుతారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, రైతులు, రైతుసంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఉప సంఘం భావించింది. ఈ క్రమంలోనే తాజాగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు ప్రభుత్వం షెడ్యూల్విడుదల చేసింది. ఇందులో జిల్లా మంత్రులతో పాటు, ఇన్చార్జ్ మంత్రులు పాల్గొననున్నారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కారు, వారి గుర్తింపునకూ విధివిధానాలు రూపొందించాలని భావిస్తున్నది. దీనికి సంబంధించి కూడా తాజా సమావేశాల్లో అభిప్రాయాలు తీసుకోనున్నట్టు తెలిసింది.