
జోరుగా బండి సంజయ్ప్రజాసంగ్రామ యాత్ర
నిర్మల్/లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్‌జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. సోమవారం యాత్ర రత్నాపూర్ కాండ్లీ నుంచి కనకాపూర్ మీదుగా బాబాపూర్ బోరిగామ, మామడ వరకు కొనసాగింది. యాత్ర సందర్భంగా బండి సంజయ్పంటచేలలో రైతులు, కనకాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామన్నారు. కనకాపూర్ లో దాదాపు 100 మందికి పైగా యువకులు బీజేపీలో చేరగా బండి సంజయ్ వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మామడలో బీజేపీ కార్యకర్తలు, యువకులు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.
నేతలతో బండి సమావేశం..
కాగా, జిల్లాలోని రెండు నియోజకవర్గాల లీడర్లతో బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ స్థితిగతులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
మంత్రి అవినీతి నిరూపిస్తాం
నిర్మల్,వెలుగు: నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన అవినీతిని నిరూపిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి చెప్పారు. సోమవారం ఆమె పార్టీ ఆఫీసులో లీడర్లు మెడిసిమ్మ రాజు, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, అలివేలు మంగ, సాధం అర్వింద్, అల్లం భాస్కర్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిర్మల్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. పనులు ఎక్కడి కాంట్రాక్టర్ చేశారో చెప్పాలన్నారు. కలెక్టరేట్‌ను ఎల్లపల్లిలో నిర్మించడం వెనుక మతలబు ఏమిటన్నారు. తనభూముల విలువ పెంచుకునేందుకే మంత్రి ఎల్లపల్లిలో కలెక్టరేట్ కట్టిస్తున్నారన్నారు. డబుల్ బెడ్ రూమ్ఇండ్లలో పెద్ద ఎత్తున్న అవకతవకలు జరిగాయన్నారు. శాంతినగర్ లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బడాబాబులు ఇష్టారాజ్యంగా ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించుకున్నా..పట్టించుకోని ఆఫీసర్లు పేదలపై ప్రతాపంచూపడం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను విమర్శించే నైతిక హక్కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దమ్ముంటే ఆర్టీఏ ద్వారా పంచాయతీలకు ఎన్నికోట్లు మంజూరవుతున్నాయో తెలుసుకోవాలన్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో మంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరి వద్ద చందాలు వసూలు చేయలేదన్నారు. విగ్రహం ఏర్పాటులో తప్పు జరిగిందని నిరూపిస్తే తాము ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని, ఒక వేళ నిరూపించనట్లయితే మంత్రి తన ఆస్తులని పేదలకు పంచిపెడుతారా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదిలేదన్నారు.
హామీల అమలులో టీబీజీకేఎస్ విఫలం
మందమర్రి,వెలుగు: కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టీబీజీకేఎస్విఫలమైందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ అక్బర్అలీ, సీఐటీయూ స్టేట్ప్రెసిడెంట్తుమ్మల రాజిరెడ్డి ఆరోపించారు. సోమవారం మందమర్రి ఏరియా ఆర్కేపీ ఓసీపీ, కాసిపేట గనిపై ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించిన గేట్ మీటింగ్‌ల్లో వారు మాట్లాడారు. సింగరేణికి రాష్ట్ర సర్కార్ నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలను ఇప్పించలేకపోయిన టీబీజీకేఎస్ లీడర్లు, కార్మికుల 11వ వేజ్‌బోర్డు ఆలస్యంపై జాతీయ కార్మిక సంఘాలను విమర్శించడం సరికాదన్నారు. ఈనెల 9న కొలిండియా, సింగరేణిలో జరిగే నిరసనల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
బొగ్గు బ్లాకుల వేలంతో సింగరేణికి నష్టం
మందమర్రి,వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బొగ్గు బ్లాకుల వేలంతో సింగరేణికి తీవ్ర నష్టం జరుగుతుందని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య పేర్కొన్నారు. సోమవారం మందమర్రి ఏరియా కేకే5 గనిపై నిరసన వ్యక్తం చేశారు. గత నెల రామగుండం పర్యటనకు వచ్చిన ప్రధాని సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించి తిరిగి బొగ్గు బ్లాకులను వేలంవేసి తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులను మోసం చేశారని మండిపడ్డారు. 2015 లో పార్లమెంట్ లో బొగ్గు బ్లాక్లుల ప్రైవేటీకరణకై ప్రవేశపెట్టిన ఎంఎండీఆర్ బిల్లుకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికి ఇప్పుడు సింగరేణిలో ఉత్తుత్తి పోరాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరసనలో ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్దేవి భూమయ్య, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్‌సెక్రటరీ నరేందర్, లీడర్లు యాదగిరి, రమణారావు, పిట్ కార్యదర్శి సదయ్య, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, స్వామి, కనకయ్య, రమేశ్, రాజేందర్, దేవేందర్, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బడుగుల అభివృద్ధికి అంబేద్కర్ కృషి
మందమర్రి,వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్బడుగుల అభివృద్ధికి కృషిచేశారని, ప్రజలంతా శాంతియుతంగా బతికేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారని జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి -ఓదెలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ చెప్పారు. సోమవారం మందమర్రిలోని సింగరేణి పార్కులో సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్అసోసియేషన్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దళిత సంఘాల బాధ్యులతో కలిసి వారు ఆవిష్కరించారు. సింగరేణి పార్కులో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు సహకరించడంతో పాటు పార్కును అంబేద్కర్ గ్రీన్ పార్కుగా పేరు మార్చడానికి కృషి చేసిన జీఎం చింతల శ్రీనివాస్‌ను వక్తలు, దళిత సంఘాలు అభినందించారు. కార్యక్రమంలో మాజీ విప్ నల్లాల ఓదెలు, సింగరేణి మెడికల్ ఆఫీసర్రాజేశ్వర్రావు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్‌రావు, జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వర్రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనుకుల తిరుపతి, ఎస్సీ లైజన్ఆఫీసర్ మైత్రేయబంధు, ఎస్టీ లైజన్ఆఫీసర్ గుగులోత్ బాబు, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ లీడర్లు బడికెల సంపత్‌కుమార్, సలేంద్ర సత్యనారాయణ, మందమర్రి ఏరియా సింగరేణి ఎస్సీఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జీడి బాపు, సెక్రటరీ దాసరి సుదర్శన్, వాసాల శంకర్, వై.శ్రీనివాస్, భూపెల్లి కనుకయ్య, నాయని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత: మంత్రి
నిర్మల్/సారంగాపూర్,వెలుగు: ఆధ్యాత్మికతతో మనిషికి ప్రశాంతత లభిస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. స్థానిక గండి రామన్న సాయిబాబా ఆలయంలో 48 గంటల అఖండ సాయి నామస్మరణ కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. దత్తసాయి ఆలయంలో రూ. 50 లక్షలతో నిర్మించిన వెహికల్షెడ్ను ప్రారంభించారు. కామోల్ చించాల, ఎడ్ బిడ్ భజన బృందానికి రూ. లక్ష విలువచేసే నాలుగు హార్మోనియం పెట్టెలను అందజేశారు. సారంగాపూర్మండలంలోని ప్యారామూర్గ్రామం నుంచి కదిలి పాపేశ్వరాలయం వరకు రూ. 4 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు, రూ. 50 లక్షలతో నిర్మించిన దత్తాశ్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సాయిబాబ ఆలయ ట్రస్టీ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటా
భైంసా,వెలుగు: వచ్చే ఎన్నికల్లో ముథోల్నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ ప్రకటించారు. సోమవారం భైంసాలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. టీఆర్ఎస్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ తనను పార్టీలో చేరాలని కోరుతున్నాయన్నారు. అభిమానులు, అనుచరుల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలన్నది త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. సమావేశంలో కుంటాల మాజీ ఎంపీపీ సయ్యాజి భోజారాం పాటిల్, మున్సిపల్ మాజీ చైర్మన్షేక్ మీరా, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంరావు పటేల్, దళిత సంఘాల ప్రతనిధి శంకర్చంద్రే, న్యాయవాది భీంరావు, పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీల ఉన్నారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా హరీశ్‌గౌడ్
మంచిర్యాల, వెలుగు: భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నెన్నెల మండలం గొల్లపల్లి ఎంపీటీసీ మెంబర్ బొమ్మెన హరీష్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు సోమవారం జిల్లా పార్టీ ఆఫీసులో నియామకపత్రం అందజేశారు. ఇంతకుముందు ఆయన జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, రఘునాథ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ రజినీష్జైన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్ పాల్గొన్నారు.
పోడు పట్టాల కోసం రైతుల ఆందోళన
మంచిర్యాల, వెలుగు: పోడు భూములకు పట్టాలు అందజేయాలని కోరుతూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం కొత్తపల్లి–సి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 20 మంది గిరిజనులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొత్తపేట సమీపంలోని బుడ్మారేగడ్ శివారులో వంద ఎకరాల్లో 1997 నుంచి పోడు వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. ఈ భూములకు పట్టాలు అందించాలని కోరారు.
హాస్టల్ భవనం కోసం ధర్నా
మంచిర్యాల, వెలుగు:ప్రస్తుత కలెక్టరేట్ భవనాన్ని ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌కు కేటాయించాలని కోరుతూ విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 2016లో హాస్టల్ కోసం నిర్మించిన భవనంలో కలెక్టరేట్ ఏర్పాటు చేసి హాస్టల్‌ను ప్రైవేట్ బిల్డింగ్‌లోకి తరలించారని అన్నారు. ఇది జూనియర్, డిగ్రీ కాలేజీలకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల వచ్చిపోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కొద్ది రోజుల్లో నస్పూర్‌లో కొత్త కలెక్టరేట్ ఓపెన్ కానున్నందున ఈ భవనాన్ని తిరిగి హాస్టల్‌కు కేటాయించాలని కోరారు.
సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర
మంచిర్యాల, వెలుగు: సింగరేణి సంస్థ ద్వారా సీఎం కేసీఆర్ కుటుంబం, కాంట్రాక్టర్లు లబ్ది పొందడానికి కుట్ర చేస్తున్నారని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఐబీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రామగుండం సభలో స్పష్టం చేసినప్పటికీ టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2015లో కోల్‌బ్లాక్‌ల వేలం బిల్లుకు అప్పటి టీఆర్ఎస్ ఎంపీలు కవిత, సుమన్ పార్లమెంట్లో మద్దతు తెలిపి ఇప్పుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థ ఇతర రాష్ర్టాల్లోని కోల్‌బ్లాక్‌లను వేలంలో దక్కించుకుంటూ తెలంగాణలో మాత్రం వేలంలో పాల్గొనడం లేదన్నారు. టౌన్ ప్రెసిడెంట్ వంగపల్లి వెంకటేశ్వర్రావు, నాయకులు రజినీష్ జైన్, అందుగుల శ్రీనివాస్, బుద్దె లక్ష్మణ్, సత్రం రమేష్, అమిరిషెట్టి రాజు, పల్లి రాకేష్, రాకేష్ రేన్వ తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధును సద్వినియోగం చేసుకోండి
జన్నారం,వెలుగు: దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని, సీఎం కేసీఆర్దళితుల జీవితాల్లో వెలుగు నింపడం కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ చెప్పారు. సోమవారం మొర్రిగూడ, ఇందన్ పెల్లి గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో మొర్రిగూడ సర్పంచ్ గోపాల్, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, జనరల్ సెక్రటరీ జనార్దన్వైస్ ఎంపీపీ వినయ్ కుమార్, జన్నారం ఎంపీటీసీ రియాజొద్దిన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సతీశ్, మాజీ వైస్ చైర్మన్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.