యూఎస్​లో ఖమ్మం స్టూడెంట్​పై దాడి చికిత్స పొందుతూ మృతి

యూఎస్​లో ఖమ్మం స్టూడెంట్​పై దాడి చికిత్స పొందుతూ మృతి

ఖమ్మం టౌన్, వెలుగు : అమెరికాలో ఎంఎస్ చదువుతూ పది రోజుల కింద ఓ దుండగుడి దాడిలో గాయపడిన ఖమ్మం సిటీకి చెందిన పుచ్చ వరుణ్ రాజ్(29) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కథనం ప్రకారం..ఖమ్మం సిటీలోని మామిళ్లగూడానికి చెందిన పుచ్చ రామ్మూర్తి,అరుణ దంపతులకు కొడుకు వరుణ్​రాజ్​తో పాటు ఓ కూతురు ఉంది. రామ్మూర్తి మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం బంజర ప్రభుత్వ స్కూల్ లో టీచర్. వరుణ్​ యూఎస్​లోని ఇండియానాలో ఎంఎస్​ చేస్తున్నాడు.

గత నెల 30న వరుణ్ ​జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వేరే వ్యక్తిపై దాడి చేయబోయి అతడిలాగే ఉన్నాడనుకుని వరుణ్ రాజ్ కణతపై కత్తితో పొడిచాడు. వెంటనే దవాఖానకు తరలించగా  డాక్టర్లు సర్జరీ కూడా చేశారు. అప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్న వరుణ్ రాజ్ మంగళవారం రాత్రి చనిపోయాడు. దాడి చేసిన దుండగుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మెదరమెట్ల స్వరూపరాణి, సభ్యులతో  కలిసి బుధవారం ఖమ్మంలోని వరుణ్ రాజ్ ఇంటికి వచ్చి తండ్రి రామ్మూర్తిని ఓదార్చారు. స్వరూపరాణి మాట్లాడుతూ యూఎస్​లో ఎన్ఆర్ఐ పేరెంట్స్ తో మాట్లాడామని, డెడ్ బాడీ ఇండియా రావడానికి మరో నాలుగు రోజులు పడుతుందన్నారు. వేనిగండ్ల శ్రీనివాసరావు, ఆళ్ల నాగేశ్వరరావు, గోవిందరావు, వీరబాబు, శివ నారాయణ, అఫ్జల్​ఉన్నారు.