వానల్లేక రైతుల పరేషాన్.. వేసిన విత్తనాలు తేమ లేక మొలుస్తలేవ్

వానల్లేక రైతుల పరేషాన్.. వేసిన విత్తనాలు తేమ లేక మొలుస్తలేవ్

వానల్లేక రైతుల పరేషాన్
వేసిన విత్తనాలు తేమ లేక మొలుస్తలేవ్
మొలిసిన మొలకలు ఎండలకు నిలుస్తలేవ్
పునాస పంటలపై భారీగా ఎఫెక్ట్    
టైమ్ కు వర్షాలు పడక రైతన్నలకు తిప్పలు  

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో పునాస సాగు షురువై నెల రోజులు అవుతున్నా.. వానలు సరిగ్గా పడకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. జూన్‌‌‌‌ నుంచే ప్రారంభం కావాల్సిన వానాకాలం సీజన్‌‌‌‌ వర్షాలు కురవకపోవడంతో నెల రోజులు ఆలస్యమైంది. ఇప్పటికీ టైమ్ కు వానల్లేకపోవడంతో సాగు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సీజన్ మొదలైందని కొందరు రైతులు పోయిన నెల మొదట్లో పడ్డ కొద్దిపాటి వర్షాలకు విత్తనాలు వేశారు. మరికొందరు చెలకలు తడిపి మరీ విత్తనాలేశారు. తీరా నెల రోజులు అవుతున్నా వానలు పడకపోవడం, ఎండలు అలాగే ఉండటంతో గింజలు మొలవక, మొలిచినవి ఎండిపోయి రైతులు పరేషాన్‌‌‌‌ అవుతున్నారు.  
 

బోర్ల కింద వరి నార్లు  

వర్షాలు సరిగ్గా లేకపోయినా బావులు, బోర్లు ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి నార్లు పోస్తున్నారు. నార్లు పెరిగేలోపైనా వర్షాలు వస్తాయని రైతులు ఈ దిశగా పనులు షురూ చేశారు. కానీ చెరువుల కింద భూములున్న రైతులు మాత్రం నార్లు పోయడానికి కూడా వానల కోసమే ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌‌‌‌లో కనీసం 45 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందన్న అంచనాలు ఉండగా, ప్రస్తుతం పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. నాట్లు కాకుండా నేరుగా వడ్లను వెదజల్లే పద్ధతిలో సాగు చేసే రైతులు సైతం ప్రస్తుతం వరి సాగు కోసం వెనుకాడుతున్నరు.    

పత్తి రైతులకు తిప్పలే 

ముందస్తుగా వానలు లేక నీరుతళ్లు పెట్టి మరీ పత్తి విత్తనాలు పెట్టిన రైతులు ఎండకు పత్తి గింజలు మొలవక ఆందోళనలో ఉన్నారు. ఒక్కో కాటన్‌‌‌‌ సీడ్‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌ రూ.853 నుంచి రూ.1,300 వరకు కొని ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పున నాటిన రైతులు మొలకలు రాక ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో బ్రోకర్లు ఎకరానికి15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ఒక్కో ప్యాకెట్‌‌‌‌ రూ.2,500కు రైతులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు వానలు లేక పత్తి మొలకెత్తకపోవడంతో నష్టపోతామని రైతులు దిగులుపడుతున్నారు. 

పునాస పంటలకు పెద్ద దెబ్బ 

సీజన్‌‌‌‌ రాకపోయినా వానలు వస్తయని రైతులు పునాస పంటలైన పెసలు, కందులు, జొన్నలు, మక్కజొన్నలు, నువ్వులు తదితర పంటల సాగు కోసం విత్తనాలు వేసిన్రు. తీరా వానలు రాకపోగా ఎండల తీవ్రత పెరగడంతో విత్తనాలు మొలవట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలు లేట్‌‌‌‌ అనుకున్నం కానీ ఇంత లేటయి పంటలకు ఎఫెక్ట్‌‌‌‌ పడుతుందని అనుకోలేదని మహబూబాబాద్‌‌‌‌ జిల్లాకు చెందిన చేరాలు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.