ఫేక్ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.87 కోట్ల విలువైన కరెన్సీ స్వాధీనం

ఫేక్ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.87 కోట్ల విలువైన కరెన్సీ స్వాధీనం

పూణే: కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. మిలిటరీ ఇంటెలిజెన్స్‌, పూణే సిటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ఫేక్ ఇండియన్, ఫారెన్ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. పూణే, విమన్ నగర్‌‌లోని బుంగలౌలో బుధవారం మధ్యాహ్నం పక్కా ప్లాన్‌తో నకిలీ కరెన్సీ ముఠాను అధికారులు పట్టుకున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్‌ (ఎమ్‌ఐ)కు చెందిన సౌతర్న్ కమాండ్ లియాజన్ యూనిట్ (ఎస్‌సీఎల్‌యూ)తో పాటు పూణే సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

ప్లాన్ ప్రకారం నోట్ల మార్పిడి కోసం ఓ డెకాయ్ గ్రూప్‌తో కలసి ఫేక్ కరెన్సీ రాకెట్ బృందాన్ని ఎమ్‌ఐ, పోలీసుల అఫీషియల్స్‌ కలిశారు. ఈ రెయిడ్‌లో రూ.2 ,000, రూ.500, చెలామణిలో లేని పాత రూ.1,000 నోట్లు, ఫేక్ యూఎస్ డాలర్లు.. రూ. 3 లక్షల (అసలైన ఇండియన్ నోట్లతోపాటు యూఎస్ డాలర్లు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫేక్ ఎయిర్ గన్, నకిలీ పత్రాలు, స్పై కెమెరాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం తీసుకున్నారు.

పోలీసులు పట్టుకున్న ఫేక్ కరెన్సీ వ్యాల్యూ ఇండియన్ రూపీస్‌లో రూ.87 కోట్లు అని తెలిసింది. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. నిందితులను పూణే ఆర్మీ యూనిట్‌లో లాన్స్ నాయక్‌ ర్యాంకులో ఉన్న షేక్ అలీం గులాబ్ ఖాన్‌తోపాటు అతడి సహచరుడు సునీల్ సర్దా, రితేశ్ రత్నాకర్, తుహౌల్ అహ్మద్, ఇషాన్ ఖాన్, అబ్దుల్ గని ఖాన్, అబ్దుల్ రెహ్మాన్‌గా గుర్తించారు. పట్టుబడిన ఫేక్ కరెన్సీని సీజ్ చేశామని, వాటిలో ఎక్కువగా ప్లే నోట్లు ఉన్నాయని.. ఈ కేసు దర్యాప్తులో వివిధ ఏజెన్సీల ప్రమేయం అవసరమని అధికారులు తెలిపారు.