పుణె: రీల్స్ వీడియోలు తీయడం కోసం యువత డేంజరస్ స్టంట్ లతో ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. మొన్న మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో ఓ యువతి రీల్స్ కోసం కారును రివర్స్ చేస్తూ లోయలో పడి చనిపోయిన ఘటన జరగగా.. తాజాగా అదే రాష్ట్రంలోని పుణేలో మరో యువతి పెద్ద బిల్డింగ్ పై నుంచి ఓ యువకుడి చేయి పట్టుకుని వేలాడిన వీడియో బయటకు వచ్చింది. ఆ యువతి స్పైడర్ మ్యాన్ సినిమాలోని ఓ సీన్ రీక్రియేట్ చేసి, వీడియో షూట్ చేసుకొని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఓ బిల్డింగ్ (దాదాపు 100 ఫీట్లు)పై నుంచి వేలాడుతూ రీల్స్ చేసింది. మరో యువకుడు పై నుంచి ఆమె చేతిని పట్టుకోగా, ఆ యువతి కిందికి వేలాడటం వీడియోలో కనిపించింది. మరో ముగ్గురు యువకులు బిల్డింగ్ చివరి నుంచి, కింద నుంచి వీడియోలు తీశారు. ఈ స్టంట్ లో ఏ మాత్రం పట్టుతప్పినా యువతి ప్రాణాలు గాల్లో కలిసేవి. ఈ ఘటన పుణెలోని స్వామి నారాయణ్ టెంపుల్ దగ్గర్లో జరిగింది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి డేంజరస్ వీడియోలు చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.

