15 మందితో పంజాబ్ మంత్రివర్గం ప్రమాణం

15 మందితో పంజాబ్ మంత్రివర్గం ప్రమాణం

చంఢీఘఢ్: పంజాబ్‌లో కొత్త మంత్రి వర్గం ఏర్పాటైంది. సీఎం చరణ్ జిత్ సింగ్ ఛన్నీ నేతృత్వంలో 15 మంది మంత్రి వర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. 15 మంది మంత్రివర్గ సభ్యుల పేర్లను ఖరారు చేసిన అనంతరం ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ బంగళాలో ప్రమాణ స్వీకారం జరిగింది.
 సీఎం చరణ్ జిత్ సింగ్ ఛన్నీ, డిప్యూటీ సీఎంలు సుఖ్జీందర్‌ రాంధవా, ఓపీ సోనీతో కలిసి ఆదివారం మధ్యాహ్నం గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ని మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. కోవిడ్ మార్గదర్శకాల దృష్ట్యా కేవలం ముఖ్య నేతలు అధికారులనే కార్యక్రమానికి ఆహ్వానించారు. పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూతోపాటు రాష్ట్ర చీఫ్ సెక్రెట‌రీ, డీజీపీ ఇత‌ర ఉన్న‌తాధికారులు ప్ర‌మాణ స్వీకారోత్‌లవంలో పాల్గొన్నారు. 
మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చి.. కొత్త ముఖ్యమంత్రి సారథ్యంలో సగం మందికిపైగా కొత్త మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. కొత్త మంత్రివర్గంలో ఆరుగురు తొలిసారే అసెంబ్లీకి ఎన్నికైన వారుండడం విశేషం. గత మంత్రుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పక్కనపెట్టి క్లీన్ చిట్.. క్లీన్ ఇమేజ్ ఉన్న వారినే ఎంపిక చేసేందుకు చాలా జాగ్రత్తగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.