ధరణి పోర్టల్​ పై పంజాబ్ ప్రతినిధి అధ్యయనం

ధరణి పోర్టల్​ పై పంజాబ్ ప్రతినిధి అధ్యయనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల కోసం వినియోగిస్తున్న ధరణి పోర్టల్​పై అధ్యయనం చేసేందుకు పంజాబ్ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. పంజాబ్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ శాఖ సెక్రటరీ, కమిషనర్​ మన్వేష్ సింగ్, రెవెన్యూ కమిషన్​ మాజీ సభ్యుడు, సలహాదారు నరేందర్​ సింగ్ సంఘా, మొహాలీ జిల్లా రెవెన్యూ అధికారి ప్రదీప్​ సింగ్ బెయిన్స్​తో కూడిన బృందం మీ సేవ కమిషనర్​ జీటీ వెంకటేశ్వర్ రావుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్​ రావు మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్​లో చాలా ఫీచర్లను ప్రవేశపెట్టామని, ఈ పోర్టల్ ఇతర రాష్ట్రాలు అనుసరించదగినదని సూచించారు. అలాగే రాష్ట్రంలో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాస్​బుక్స్​ జారీ, ఎలాంటి మోసాలకు తావులేని రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విధానం గురించి ఆయన పంజాబ్​ అధికారులకు వివరించారు. ఆ తర్వాత అధికారుల బృందం శంషాబాద్ తహసీల్దార్ ఆఫీసును సందర్శించింది. ఫీల్డ్ లెవల్​లో ధరణి పోర్టల్ పనితీరును పరిశీలించారు. ల్యాండ్ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ కృషిని వారు అభినందించారు.